మా మొర ఆలకించండి.. నేడు గవర్నర్ తో ఆర్టీసీ నాయకుల భేటీ
ఇప్పుడు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసే విషయంలో ఆలస్యం చేస్తున్నారు. ఆ బిల్లుని న్యాయశాఖకు పంపించారు. మరోవైపు ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. ఈ దశలో తమ జీవితాలు మారిపోతాయనుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంకా అమలులోకి రాలేదు. కారణం ఆ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. దానికి కారణం తెలంగాణ గవర్నర్. ఆర్టీసీ విలీన బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టే విషయంలో ఆలస్యం చేసిన గవర్నర్, తీరా బిల్లు అసెంబ్లీనుంచి ఆమోదం పొంది వచ్చిన తర్వాత కూడా మరింత ఆలస్యం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు గవర్నర్ ని కలసి బిల్లు విషయంలో సత్వర సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయబోతున్నారు. ఈమేరకు ఆర్టీసీ టీజేఏసీ నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు.
ఎందుకీ ఆలస్యం..?
ఆర్టీసీ బిల్లు వ్యవహారం మొదటినుంచీ వార్తల్లో ఉంటోంది. ద్రవ్య బిల్లు కాబట్టి అసెంబ్లీలో ప్రవేశ పెట్టేముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లుని రాజ్ భవన్ కు పంపించింది. కానీ అనుమతి అంత త్వరగా రాలేదు. ఆర్టీసీ ఉద్యోగులు రాజ్ భవన్ ముట్టడి, విమర్శల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై 10 సిఫారసులు చేసి బిల్లుని అసెంబ్లీకి పంపించారు. ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఆ తర్వాత చట్టం కావడానికి గవర్నర్ రాజముద్ర తప్పనిసరి. ఇప్పుడు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసే విషయంలో ఆలస్యం చేస్తున్నారు. ఆ బిల్లుని న్యాయశాఖకు పంపించారు. మరోవైపు ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. ఈ దశలో తమ జీవితాలు మారిపోతాయనుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అందుకే మరోసారి గవర్నర్ దగ్గరకు వెళ్తున్నారు.
ఆర్టీసీ విలీనం బిల్లు లా సెక్రటరీ నుంచి రాజ్ భవన్ కు వచ్చింది. అసెంబ్లీ లో ప్రవేశపెట్టే ముందు డ్రాఫ్ట్ బిల్ కు తాను చేసిన 10 సిఫార్సులపై లా సెక్రటరీ వివరణ ఇచ్చారని, వాటిని స్టడీ చేయాల్సి ఉందని అంటున్నారు గవర్నర్. వేలాదిమంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో తమ సంగతి త్వరగా తేల్చాలంటున్నారు ఉద్యోగులు. ఈరోజు గవర్నర్ తమిళిసై సమాధానం ఎలా ఉంటుందో వేచి చూడాలి.