ఇక `స్మార్ట్`గా.. తెలంగాణలో బస్సు ప్రయాణం..
Digital Payment Services in TSRTC: ఇటీవల కొత్తగా వేసిన రూట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు నిర్ణయించారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఇకపై స్మార్ట్‌గా సాగనుంది. జనవరి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమలులోకి తేనున్నారు. మెట్రో రైళ్లలో మాదిరిగా స్మార్ట్ కార్డుల ద్వారా ప్రయాణించే విధానం అందుబాటులోకి రానుంది. తొలుత కార్డులు వినియోగించేందుకు ఐటిమ్ (ఇంటెలిజెన్స్ టిక్కెట్ ఇష్యూ మెషీన్) లను వినియోగిస్తారు. ఆ తర్వాత ముంబై తరహాలో బస్సు ఎక్కేటప్పుడు స్వైప్ చేసే మెషీన్ ని అందుబాటులోకి తేనున్నారు.
ఇటీవల కొత్తగా వేసిన రూట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు నిర్ణయించారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. హైటెక్ సిటీ, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, రాయదుర్గం మెట్రో స్టేషన్లను కలుపుతూ మాదాపూర్, గచ్చిబౌలిలోని ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లోని మార్గాల్లో తెలంగాణ ఆర్టీసీ వజ్ర మినీ ఏసీ బస్సులను షటిల్ సర్వీసులుగా నడపాలని నిర్ణయించారు. వాటిలోనూ డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తారు.
ఐటీ కారిడార్‌లో బస్సులు బయలుదేరే ప్రాంతంలో ప్రత్యేక కౌంటర్లు పెట్టి టిక్కెట్లు ఇవ్వడంతో పాటు డ్రైవర్, కండక్టర్ వద్ద ఉన్న ఐటిమ్స్ ద్వారా టిక్కెట్లు తీసుకునే సదుపాయం కల్పిస్తున్నారు.