వరదల నష్టం ఎంతంటే..? హైకోర్టుకి ప్రభుత్వ నివేదిక

భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 41 మంది మరణించినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. వివిధ జిల్లాల్లో 240 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 5వేల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిపింది.

Advertisement
Update:2023-08-01 07:13 IST

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఎంత నష్టం వాటిల్లిందనే విషయంపై హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. వరద ప్రాంతాల్లో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ డాక్టర్ చెరకు సుధాకర్ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వరదలపై నివేదికను హైకోర్టుకు అందించింది.

మరణాలు -41

భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 41 మంది మరణించినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. వివిధ జిల్లాల్లో 240 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 5వేల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిపింది. దాదాపు 5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపింది. పంట నష్టం వివరాలు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది సేకరిస్తున్నారని చెప్పింది. వరదల్లో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు పోలీసులు, ఫైర్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ కృషి చేశాయని తెలిపింది. హెలికాప్టర్ ద్వారా ఐదుగురి ప్రాణాలను కాపాడినట్లు వివరించింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన సదుపాయాలు కల్పించామని తెలిపింది.

కొనసాగుతున్న సర్వే..

వరదల్లో పంట నష్టంపై అంచనా వేసేందుకు సర్వే కొనసాగుతోందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. నివేదికను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపిన ధర్మాసనం.. విచారణను నేటికి (ఆగస్టు 1) వాయిదా వేసింది. మరోవైపు వివిధ శాఖలకు ఏర్పడిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేసింది. 

Tags:    
Advertisement

Similar News