తల్లి మరణాన్ని మరోసారి రాజకీయం చేస్తున్న తెలంగాణ గవర్నర్..

విమానం ఏర్పాటు చేసేంత వరకు గవర్నర్ వేచి చూడకుండా, మరో ప్రైవేటు విమానంలో తల్లి భౌతిక కాయాన్ని తమిళనాడుకి తరలించారు. ఈ విషయాలన్నీ కావాలనే పక్కనపెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు తమిళిసై.

Advertisement
Update:2022-11-26 16:23 IST

తెలంగాణలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. బీజేపీ అజెండాని ఫాలో అవుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు గవర్నర్ తమిళిసై. ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఆరోపణలు మరీ దారుణంగా ఉంటున్నాయి. తల్లి మరణాన్ని కూడా ఆమె రాజకీయం చేయాలని చూడటం ఇక్కడ అత్యంత దారుణమైన విషయం. తన తల్లి మరణిస్తే, సీఎం కేసీఆర్ కనీసం ఆమె భౌతిక కాయాన్ని చూసేందుకు రాలేదని, తనని పరామర్శించలేదని అన్నారు తమిళిసై. గవర్నర్ తల్లి గతేడాది ఆగస్ట్ లో చనిపోయారు. గతంలో ఓసారి ఇదే విషయంపై ఆరోపణలు చేసిన తమిళిసై, తాజాగా ఆ పాత వ్యవహారాన్ని తిరగదోడారు. సీఎం కేసీఆర్ అప్పుడు పరామర్శకు రాలేదంటూ ఇప్పుడు రాజకీయ విమర్శలు చేశారు.

ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పరామర్శకు రాలేదా..?

2021 ఆగస్ట్ లో సీఎం కేసీఆర్ కరోనాకు గురయ్యారు. ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇంటికే పరిమితం అయ్యారు. ఆ సమయంలో ఆయన ఎవరినీ కలవలేదు, అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. అలాంటి సమయంలో గవర్నర్ తమిళిసై తల్లి కృష్ణ కుమారి మరణించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ గవర్నర్ కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు హరీష్ రావు, తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా గవర్నర్ కు సంతాప సందేశం పంపించారు. గవర్నర్ తల్లి అంత్యక్రియలు కూడా తమిళనాడులో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారమే జరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని లేవనెత్తి తమిళిసై ఆరోపణలు చేయడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది.

తన తల్లి భౌతిక కాయాన్ని తమిళనాడుకు చేర్చేందుకు ప్రత్యేక విమానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనేది తమిళిసై మరో ఆరోపణ. అయితే అక్కడ విమానం ఏర్పాటు చేసేంత వరకు గవర్నర్ వేచి చూడకుండా, మరో ప్రైవేటు విమానంలో తల్లి భౌతిక కాయాన్ని తమిళనాడుకి తరలించారు. ఈ విషయాలన్నీ కావాలనే పక్కనపెట్టి తమిళిసై తెలంగాణ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. మహిళను కాబట్టే తనను అవమానించారని, విస్మరించారని ఆరోపణలు చేస్తున్నారు తమిళిసై.

కరోనా కారణంగా కేసీఆర్ రాజ్ భవన్ కి రాలేకపోయారు, గవర్నర్ ని నేరుగా కలసి పరామర్శించలేకపోయారు. ఆ సమయంలో అసలు కేసీఆర్ ఇల్లు కూడా కదలలేని పరిస్థితి. కానీ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News