బీఆర్ఎస్ పై ఇంకా అక్కసు తీరలేదా..?

ఓటర్స్ డే సందర్భంగా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన గవర్నర్ తమిళిసై.. వ్యక్తిగతంగా తాను నోటాకు వ్యతిరేకం అన్నారు. ఓటర్లు కచ్చితంగా ఎవరో ఒకర్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement
Update:2024-01-25 19:23 IST

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి ఏ స్థాయిలో ఆధిపత్యపోరు జరిగిందో అందరికీ తెలుసు. ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో గవర్నర్ పదే పదే ప్రభుత్వానికి అడ్డుతగిలారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా ఆమె శాంతించలేదనే విషయం స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిపై ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. గతంలో కౌషిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి విషయంలో మోకాలడ్డిన గవర్నర్.. ఆయన ఎమ్మెల్యే ఎన్నికను కూడా తప్పుబట్టడం విశేషం. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తమిళిసై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

అసలేం జరిగింది..?

అసెంబ్లీ ఎన్నికల వేళ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పాడి కౌషిక్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు కుటుంబంతో సహా ఓ విన్నపం చేశారు. ఈ ఎన్నికలు తనకు కీలకం అని, గెలవకపోతే చావే శరణ్యం అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. అయితే మరోసారి ఆ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ గవర్నర్ తమిళిసై, బీఆర్ఎస్ పై తనకున్న అక్కసు బయటపెట్టారు. నేషనల్ ఓటర్స్‌డే సందర్బంగా జేఎన్‌టీయూలో నిర్వహించిన సభలో ప్రసంగించిన గవర్నర్.. కౌషిక్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు.

నోటాకు వ్యతిరేకం..

ఓటర్స్ డే సందర్భంగా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన గవర్నర్ తమిళిసై.. వ్యక్తిగతంగా తాను నోటాకు వ్యతిరేకం అన్నారు. ఓటర్లు కచ్చితంగా ఎవరో ఒకర్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటింగ్ కోసమేనని, సెలవులపై ఊళ్లకు వెళ్లేందుకు కాదని అన్నారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్లో ఉండే ప్రజలు, పోలింగ్ కేంద్రం ముందు కూడా అదే నిబద్ధతతో క్యూలో నిలబడాలని పిలుపునిచ్చారు. ‘ఓటు’ అనే పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు.

Tags:    
Advertisement

Similar News