తెలంగాణ హరితోత్సవం.. నేడు అర్బన్ పార్కుల్లో ఉచిత ప్రవేశం
తుమ్మలూరు అర్బన్ పార్క్ లో సీఎం కేసీఆర్ మొక్కలు నాటి 9వ విడత హరిత హారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అర్బన్ పార్కుల్లో ఈరోజు ఉచిత ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ హరితోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హరితోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి జరిగిన కృషిని, దాని ద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు. 9వ విడత హరిత హారం కార్యక్రమం కూడా ఈరోజే మొదలవుతుంది. తుమ్మలూరు అర్బన్ పార్క్ లో సీఎం కేసీఆర్ మొక్కలు నాటి 9వ విడత హరిత హారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అర్బన్ పార్కుల్లో ఈరోజు ఉచిత ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణకు హరితహారం..
దేశవ్యాప్తంగా రోజు రోజుకీ పచ్చదనం హరించుకుపోతోంది, చెట్లు నరికేసి అటవీ ప్రాంతాలన్నిటినీ మైదానాలుగా మార్చేస్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత మాత్రం ఇక్కడ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కంటే, స్వచ్ఛమైన గాలి, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో అందరికీ ఇది అసాధ్యం అనిపించినా, ఎనిమిదేళ్లలో తెలంగాణలో పెరిగిన వృక్షసంపద చూసి ఇప్పుడు యావత్ భారత దేశమే ఆశ్చర్యపోతోంది.
ఇదీ హరితహారం లెక్క..
హరితహారంలో భాగంగా గత 8 ఏళ్లలో నాటిన మొక్కలు 273.33 కోట్లు
తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటైన నర్సరీలు 14,864
హరితహారం మొత్తం ఖర్చు రూ.10,822 కోట్లు
13.44 లక్షల ఎకరాల అటవీ భూమి పునరుద్ధరణ
రాష్ట్రవ్యాప్తంగా 75,740 ఎకరాల్లో 109 అర్బన్ ఫారెస్ట్ ల అభివృద్ధి.
గ్రేటర్ పరిధిలో 147 శాతానికి పైగా భారీగా పెరిగిన గ్రీన్ కవర్
హరితహారం ద్వారా ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా హైదరాబాద్ కి గుర్తింపు రావడంతోపాటు, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ.. పచ్చదనం పెంచడంలో తెలంగాణకు మొదటి స్థానం ఇచ్చింది. నీతి ఆయోగ్ సమీకృత అభివృద్ధి లక్ష్యాల్లో కూడా తెలంగాణ ఫస్ట్ ప్లేస్ సాధించింది. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్, జీవ వైవిధ్య నగరంగా హైదరాబాద్ కి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లాంటివి చాలానే వచ్చాయి.