'నకిలీ రంగు'.. మోదీపై కాంగ్రెస్ సెటైర్
హోలీ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో మంట పెట్టింది. బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి.
హోలీ సందర్భంగా రాజకీయ నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం సహజమే. కానీ హోలీని కూడా రాజకీయ విమర్శలకు చక్కగా వినియోగించుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రధాని మోదీపై సెటైరికల్ ట్వీట్ వేశారు. 'నకిలీ రంగు' అంటూ బీజేపీని టార్గెట్ చేశారు.
మన ప్రజాస్వామ్యానికి ఒక 'నకిలీ రంగు' అంటుకుందని, ఆ రంగు ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేసి, దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించే దిశగా సాగుతోందని ఆ ట్వీట్ సారాంశం. ఇకనైనా ప్రజలు మేల్కొనాలని, ఆ నకిలీ రంగు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని గుర్తించాలని, ఓటు అనే ఆయుధంతో నకిలీ రంగు బారి నుంచి దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ట్వట్టర్ ద్వారా కోరారు.
సోషల్ మీడియా వార్..
హోలీ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో మంట పెట్టింది. బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. నకిలీ రంగు కాంగ్రెస్ దేనంటూ బీజేపీ నేతలు బదులిస్తున్నారు. ఆరు గ్యారెంటీల సంగతి ముందు చూడండి అంటూ కొందరు సలహాలిస్తున్నారు. మొత్తమ్మీద హోలీ వేళ కాంగ్రెస్ వేసిన ట్వీట్ రెండు పార్టీల మద్య సోషల్ మీడియా వార్ కి శ్రీకారం చుట్టింది.