ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా పద్దులు
కాంగ్రెస్ సర్కార్ అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందన్న కిషన్‌రెడ్డి;
అట్టహాసంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన జరిగిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు.పదేళ్లపాటు బీఆర్‌ఎస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అగాథంలోకి నెట్టేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసింది. గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మొదటి ఏడాది కదా అని తప్పించుకున్నారు. 15 నెలలు పాలించిన తర్వాత కూడా ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారు. వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా.. కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందన్నారు. అంకెల గారడీ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన బడ్జెట్ ఇది అని ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలపై ప్రజలు ఆశలు వదులుకోవాలని బడ్జెట్ నిరూపించింది. ప్రభుత్వ ఆదాయం, రాబడిపై కనీస అవగాహన లేకుండా అంచనా రూపొందించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.