ఆ ప్రకటనలో భట్టి ఫొటో మిస్సింగ్.. కాంగ్రెస్ లో తీవ్ర చర్చ

వాస్తవానికి డిప్యూటీ సీఎం పోస్ట్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కర్నాటక, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సీఎంతోపాటు, డిప్యూటీ సీఎంకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాయి.

Advertisement
Update:2024-03-05 08:55 IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కూడా ఆ స్థాయిలో ప్రాధాన్యత దక్కడం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలకోసం ఇద్దరూ కలిసి వెళ్లి గవర్నర్‌ను ఆహ్వానించారు. ప్రజాపాలన కార్యక్రమానికి ఇద్దరి ఫొటోలతో ప్రచారం జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ఆర్థిక సాయం పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించే సమయంలోనూ ఇద్దరి ఫొటోలు కనిపించాయి. కానీ ఇప్పుడు భట్టి ఫొటో మిస్ అయింది. ప్రజా పాలనలో కొలువుల పండగ అంటూ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమ ప్రచారంలో భట్టి ఫొటో లేదు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఫొటో, ఆయన పేరుతోనే ఈ కార్యక్రమం జరిగింది. దీనిపై భట్టి వర్గం కినుక వహించినట్టు సమాచారం.

తప్పెవరిది..?

ఉద్దేశపూర్వకంగానే భట్టి ఫొటోని ఆ కార్యక్రమ ప్రచారంలో తొలగించారా, లేక శాఖల మధ్య సమన్వయ లోపంతో పొరపాటు జరిగిందా..? అనేది తేలాల్సి ఉంది. దీనిపై అప్పుడే భట్టి వర్గం ఎంక్వయిరీలు మొదలుపెట్టింది. ఆయన అనుచరులు ముందుగా I&PR విభాగానికి ఫోన్ చేసి వివరణ అడిగారు. పార్టీ నుంచి వచ్చిన ఫార్మాట్ ప్రకారమే తాము ప్రకటనలిచ్చామంటూ సదరు విభాగం స్పష్టం చేసింది. తిరిగి గాంధీభవన్ వర్గాలకు ఫోన్ చేసి ఎంక్వయిరీ చేయగా.. ఆ ప్రకటన తాము ఇవ్వలేదని, I&PR ఇచ్చిందని వారు వివరణ ఇచ్చారు. దీంతో భట్టి వర్గంలో మరింత కన్ఫ్యూజన్ మొదలైంది. అసలేం జరిగింతో తేల్చుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

వాస్తవానికి మిగతా రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పోస్ట్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కర్నాటక, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సీఎంతోపాటు, డిప్యూటీ సీఎంకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాయి. తెలంగాణలో తొలినాళ్లలో ఇలాగే జరిగింది. ఇప్పుడు సడన్ గా డిప్యూటీ సీఎం భట్టి ఫొటో లేకుండా ప్రకటనలు బయటకు రావడం, ప్రచారం మొదలవడంతో వ్యవహారంలో తేడా వచ్చింది. అనుచరులు దీన్ని సీరియస్ గా తీసుకున్నా పార్టీకి పెద్దగా నష్టం లేదు కానీ, నాయకుల్లో ఇగోలు మొదలయితేనే అసలు సమస్య. 

Tags:    
Advertisement

Similar News