ఏపీకి వస్తున్న రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. ఆయనతోపాటు తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వస్తారని అంటున్నారు.

Advertisement
Update:2024-07-07 18:23 IST

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ వెళ్లి ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు రాష్ట్రాల సమస్యలపై చర్చించిన రోజుల వ్యవధిలోనే తెలంగాణ సీఎం రేవంత్ రరెడ్డి ఏపీ పర్యటన ఖరారు కావడం విశేషం. అయితే ఇది పొలిటికల్ టూర్ కాదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. ఆయనతోపాటు తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వస్తారని అంటున్నారు. ఇక ఇటీవల కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంని నేరుగా కలసి విజయవాడలో జరిగే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి రావాల్సిందిగా షర్మిల ఆహ్వానించారు. విజయవాడలో వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

వైసీపీకి పోటీగా..

వైఎస్ఆర్ జయంతిని వైసీపీ, పార్టీ కార్యక్రమంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. గతంలో వైఎస్ షర్మిల కూడా అన్న జగన్ తో కలసి ఇడుపులపాయలో తండ్రి సమాధివద్ద నివాళులర్పించేవారు. ఇటీవల వారిద్దరూ విడివిడిగా నివాళి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు వైసీపీకి పోటీగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్విహించేందుకు షర్మిల ప్రణాళిక సిద్ధం చేశారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాహుల్ గాంధీ కూడా విజయవాడకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జయంతిని గుర్తు చేస్తూ సోనియా గాంధీ కూడా ప్రత్యేక సందేశం విడుదల చేయడం విశేషం.


ఏపీలో కాంగ్రెస్ కి పునర్వైభవం తేవాలని చూస్తోంది అధిష్టానం. తెలంగాణలో ఆల్రడీ పార్టీ అధికారంలో ఉండటంతో ఏపీలో కూడా ఆ హవా కొనసాగించాలనుకుంటున్నారు. అయితే ఏపీలో పాత కాంగ్రెస్ నేతలంతా వైసీపీ, టీడీపీలోకి సర్దుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరం కావడంతో మళ్లీ కాంగ్రెస్ పుంజుకోవాలని చూస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో ఏపీ ప్రజలు కాంగ్రెస్ ని అంత తేలిగ్గా క్షమించరు కానీ, గట్టి నాయకులుంటే మాత్రం పరిస్థితిలో క్రమక్రమంగా మార్పులొస్తాయని అధినాయకత్వం అంచనా వేస్తోంది. పనిలో పనిగా వైఎస్ఆర్ సెంటిమెంట్ ని ఉపయోగించుకోడానికి షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. వైసీపీకి పోటీగా వైఎస్ఆర్ జయంతిని ఉపయోగించుకోడానికి కూడా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News