బీజేపీ ఫైనల్ లిస్ట్.. మూడు చోట్ల మార్పులు.!
తాజా లిస్టులో పేర్లున్న కొందరు అభ్యర్థులు గురువారమే ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ కాల్ అందుకున్నారు. వారంతా నామినేషన్లకు రెడీ కావాలని అధిష్టానం సూచించింది. తాజా లిస్ట్‌లో వారి పేర్లను ఖరారు చేసింది.
నామినేషన్ల స్వీకరణకు ఒక్కరోజు గడువు మిగిలుండగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. 11 పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనతో పాటు మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. మొత్తంగా 14 మందితో ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసింది. జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
తాజా లిస్టులో పేర్లున్న కొందరు అభ్యర్థులు గురువారమే ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ కాల్ అందుకున్నారు. వారంతా నామినేషన్లకు రెడీ కావాలని అధిష్టానం సూచించింది. తాజా లిస్ట్‌లో వారి పేర్లను ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి నుంచి రాజేశ్వర్ రావు దేశ్‌పాండే, మేడ్చల్ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి రామచందర్ రావు, శేరిలింగంపల్లి నుంచి రవి కుమార్ యాదవ్, నాంపల్లి నుంచి రాహుల్ చంద్ర అభ్యర్థిత్వాలను ఫైనల్ చేసింది. వీరితో పాటు దేవరకద్ర నుంచి కొండా ప్రశాంత్ రెడ్డి, అలంపూర్ నుంచి శ్రీమతి మేరమ్మ, నర్సంపేట నుంచి పుల్లారావు, మధిర నుంచి పెరుమార్పల్లి విజయరాజుకు అవకాశం ఇచ్చింది.
ఇక బెల్లంపల్లి, వనపర్తి, చాంద్రాయణగుట్ట స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికి అవకాశమిచ్చిన బీజేపీ.. తాజాగా ఆమెను తప్పించి కొయ్యల హేమాజీకి టికెట్ కేటాయించింది. ఇక వనపర్తిలో పోటీ నుంచి అశ్వద్ధామ రెడ్డి తప్పుకోవడంతో అనుగ్నా రెడ్డిని పోటీలో ఉంచింది. ఇక చాంద్రాయణగుట్టలో ఆరోగ్య సమస్యల కారణంగా అభ్యర్థి పోటీ చేయనని చెప్పడంతో కె.మహేందర్‌కు టికెట్ ఇచ్చింది. ఇక పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది బీజేపీ. 8 స్థానాలకు జనసేన ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.