తమిళనాడు కల్తీ మద్యం ఘటన.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ రిక్వెస్ట్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు ఘటనను చూపి పాఠం నేర్చుకుంటుందని భావిస్తున్నానన్నారు. కల్తీ మద్యానికి ప్రజల ప్రాణాలను బలిపెట్టొద్దని కోరారు.
తమిళనాడు కళ్లకురిచిలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికే 40కి చేరింది. మరో 70 మందికిపై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది తమిళనాడులో విల్లుపురం జిల్లాలోనూ 22 మంది కల్తీ మద్యానికి బలయ్యారు.
తాజాగా ఈ అంశంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుందామన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు ఘటనను చూపి పాఠం నేర్చుకుంటుందని భావిస్తున్నానన్నారు. కల్తీ మద్యానికి ప్రజల ప్రాణాలను బలిపెట్టొద్దని కోరారు.
ఇటీవల తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు సోమ్ డిస్టిలర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గతంలో సోమ్ డిస్టిలరీస్ మధ్యప్రదేశ్‌లో చీప్ లిక్కర్ సరఫరా చేసి అనేక మంది చావులకు కారణమైందని బీఆర్ఎస్ నేతలు సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సోమ్ డిస్టిలరీస్‌కు తెలంగాణలో ఇచ్చిన పర్మిషన్‌ను రద్దు చేసింది. సోమ్ డిస్టిలరీస్‌లో మద్యం తయారీకి బాల కార్మికులను వినియోగిస్తున్నట్లు తేలడంతో రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ సర్కార్ సైతం లైసెన్స్ రద్దు చేసింది.