తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సరైన్
యాజమాన్యానికి నోటీసు ఇవ్వనున్న కార్మిక సంఘాలు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సరైన్ మోగనుంది. నాలుగేళ్ల తర్వాత టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి నోటీసు ఇవ్వనున్నాయి. ఆర్టీసీ సీఎండీకి సోమవారం నోటీసులు ఇవ్వనున్నట్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీ, కౌన్సిల్ లో బిల్లు పాస్ చేశారు. గవర్నర్ ఆమోదం ఆలస్యమవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమయ్యింది. ఆలోగానే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యంగంలో ప్రసాదించిన కార్మిక హక్కులను ఆర్టీసీ యాజమాన్యం హరిస్తోందని.. ఈ పరిస్థితుల్లో హక్కుల సాధన కోసం ఆర్థిక, ఇతర అంశాల సాధన కోసం సమ్మె నోటీసు ఇవ్వడానికి బస్ భవన్ కు కార్మికులు, ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. హక్కుల కోసం పోరాడకపోతే మన బానిసత్వానికి మనమే కారణమవుతామని పేర్కొన్నారు. సంస్థను ప్రైవేటుపరం చేయమని చెప్తూనే ఎలక్ట్రిక్ బస్సులను భారీగా తెస్తూ డ్రైవర్లను తిప్పలు పెడుతున్నారని తెలిపారు. ఉద్యోగంలో అభద్రత పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు.