రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగ్ సబ్జెక్ట్ షర్మిల

ఇక షర్మిల నిర్ణయం ఇటు ఏపీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు ప్యాకేజీ కల్యాణ్, చంద్రబాబు దత్తపుత్రుడంటూ సీఎం జగన్ సహా వైసీపీ వాళ్లు పవన్ కల్యాణ్ ని వెటకారం చేసేవారు. ఇప్పుడు షర్మిల ఎవరి దత్త పుత్రికో చెప్పాలంటూ జనసేన నేతలు లాజిక్ తీస్తున్నారు.

Advertisement
Update:2023-11-04 14:15 IST

తెలంగాణ ఎన్నికల గురించి ఏపీలో పెద్దగా ఎవరూ మాట్లాడుకోవడంలేదు. ఏపీలో పరిస్థితుల గురించి తెలంగాణలో చర్చ లేదు. కానీ ఇప్పుడు ఉమ్మడిగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సడన్ గా హైలైట్ అవుతున్నారు వైఎస్ షర్మిల. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా ఆమె మారిపోయారు. విలీనం అన్నారు, ఒంటరి పోరు అన్నారు, చివరికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నానంటూ కాంగ్రెస్ కి సాగిలపడ్డారు, తెలంగాణ ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేశారు. ఈ క్రమంలో ఆమె తాజా ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అంతన్నారింతన్నారు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్టీపీయేనని గతంలో ధీమాగా చెప్పేవారు వైఎస్ షర్మిల. అంతే కాదు, అధికారంలోకి వచ్చాక తాను చేపట్టబోయే కార్యక్రమాలను కూడా వివరించేవారు. కరోనా సమయంలో ఆస్పత్రి బిల్లుల మొత్తాన్ని తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు చెల్లిస్తామనే హామీ కూడా ఆమె గతంలో ఇచ్చారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ కి మద్దతిచ్చే క్రమంలో పగలు, రాత్రి అంటూ షర్మిల చెప్పిన మాటలు కూడా మరోసారి 'అసలు పాదయాత్ర అంటే..' అనే రేంజ్ లో వైరల్ గా మారాయి. వైఎస్ఆర్ బతికే ఉంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారంటూ షర్మిల చెప్పిన డైలాగులు కూడా సోషల్ మీడియాలో రిపీట్ అవుతున్నాయి.


ఇటు ఏపీలో కూడా..

ఇక షర్మిల నిర్ణయం ఇటు ఏపీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు ప్యాకేజీ కల్యాణ్, చంద్రబాబు దత్తపుత్రుడంటూ సీఎం జగన్ సహా వైసీపీ వాళ్లు పవన్ కల్యాణ్ ని వెటకారం చేసేవారు. ఇప్పుడు షర్మిల ఎవరి దత్త పుత్రికో చెప్పాలంటూ జనసేన నేతలు లాజిక్ తీస్తున్నారు. షర్మిలకు అందిన ప్యాకేజీ ఎంతో చెప్పాలని సెటైర్లు పేలుస్తున్నారు. ఈ సెటైర్లు తట్టుకోవడం ఇటు వైసీపీ వారికి సాధ్యం కావడంలేదు. ఆమె నిర్ణయం ఆమె ఇష్టం అనేస్తున్నారు. షర్మిల నిర్ణయాన్ని హైలైట్ చేస్తూ.. జనసేన నేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. మొత్తమ్మీద తెలంగాణ ఎన్నికలకు సంబంధించి షర్మిల తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

 

Tags:    
Advertisement

Similar News