SNDP కార్యక్రమం: కిషన్ రెడ్డి ట్వీట్లలో నిజముందా ?
హైదరాబాద్ లో వరదల నియంత్రణకోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్లలో నిజముందా? 985 కోట్ల రూపాయలతో అనేక వరద నియంత్రణ చర్యలను చేపట్టి అనేక కాలనీలను వరద ముప్పు నుంచి రక్షించిన ప్రభుత్వం పై విమర్శల్లో అర్దముందా ?
హైదరాబాద్ నగరం లో వరదల నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రణాళిక (SNDP) కింద ప్రభుత్వం కేటాయించిన నిధులను ఖర్చు పెట్టడం లేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో నిజముందా ? నిజంగానే హైదరాబాద్ లో వరదల నియంత్రణకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేయకుండానే ఒకప్పుడు వరద ముప్పుతో గజగజలాడే అనేక కాలనీలు ఇప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా ప్రశాతంగా ఉండగల్గుతున్నాయా ?
అసలు నిజా నిజాలేంటి ?
రాష్ట్ర ప్రభుత్వం SNDP కార్యక్రమం ద్వారా సుమారు 985 కోట్ల రూపాయలతో అనేక వరద నియంత్రణ చర్యలను హైదరాబాద్ నగరంలో చేపట్టింది. దాదాపుగా 450 కోట్ల రూపాయల పనులు పూర్తయి పోయాయి.
ఈ మేరకు సెప్టెంబర్ 30 నాటికి సుమారు 103 కోట్ల రూపాయలను GHMC వర్కింగ్ ఏజెన్సీలకు చెల్లించింది.
మరో 150 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపు ప్రక్రియలో ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా సుమారు 253 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయన్న విషయం కిషన్ రెడ్డి ప్రజలకు చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు.
దీంతో పాటు మరో 200 కోట్ల రూపాయల పనులు తుది దశలో ఉన్నాయి. చెల్లించిన బిల్లులు, చెల్లింపు ప్రక్రియ లో ఉన్న బిల్లులు, కొనసాగుతున్న పనులు అన్ని కలిపితే సుమారు 450 కోట్ల రూపాయల SNDC పనులు వేగంగా జరుగుతున్నాయి.
GHMC చేపట్టిన SNDP కార్యక్రమానికి ఎలాంటి నిధుల కొరత లేదు బిల్లుల చెల్లింపు కూడా వేగంగా కొనసాగుతున్నది.
SNDP కింద చేపట్టిన కార్యక్రమాల వల్ల అనేక కాలనీలు ముంపు ముప్పునుండి బైటపడ్డాయి. ముఖ్యంగా బండ్లగూడ, నాగోల్,హయత్ నగర్, సింగరేణి కాలనీ, రామంతపూర్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల, మదీనా గూడ, నిజాంపేట్,బంజారా కాలనీ, సరస్వతీ నగర్, మన్సురాబాద్, వనస్థలిపురం లోని క్రిస్టియన్ కాలనీ, కోదండ రామ్ నగర్, పి అండ్ టీ కాలనీ, తపోవన్ కాలనీ, స్వర్ణాంధ్ర కాలనీ యాప్రాల్, హబీబ్ నగర్, ఇక్రిసాట్ కాలనీ, హఫీజ్ బాబా నగర్, ముర్కి నాల వంటి ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాల్లో ప్రతి ఏడాది వరదలతో సతమతమయ్యే ప్రజలు ఈసారి చేపట్టిన SNDP కార్యక్రమాల వలన వరద ముప్పు పోయి ప్రశాంతంగా ఉండగల్గుతున్నారు.
స్వయంగా కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట్ కానీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ఆయనకి అవగాహన లేకపోవడంమే కాక తనకున్న సమాచార లోపంతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ట్వీట్లు చేయడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?