గవర్నర్ ను కలిసిన షర్మిల...తెలంగాణ లో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి
వైఎస్. వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ తన పని తాను చేయాలని కోరుతున్నామన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని షర్మిల తెలిపారు.
తెలంగాణలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కోరారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో షర్మిల కొద్ది సేపటి క్రితం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరానని చెప్పారు.
''తెలంగాణలో వాస్తవ పరిస్థితులను వివరించేందుకే గవర్నర్‌ను కలిశా. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు. దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉంటే తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతుంది. తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం లేదు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం. వీధి కుక్కలు దాడి చేసి పసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కులేదు.'' అని షర్మిల ఆరోపించారు.
ఇక వైఎస్. వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ తన పని తాను చేయాలని కోరుతున్నామన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని షర్మిల తెలిపారు.
మీడియాతో మాట్లాడిన అనంతరం షర్మిల నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని పరామర్శించడానికి బయలుదేరి వెళ్ళారు. .