కాంగ్రెస్‌కు "సర్వే" రూపంలో కొత్త గండం

40 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు సర్వే సత్యనారాయణ. తనను కాదని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-04-25 12:40 IST

అధికార కాంగ్రెస్‌కు కేంద్రమాజీ మంత్రి, సీనియర్‌ నేత సర్వే సత్యనారాయణ రూపంలో కొత్తగండం మొదలైంది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా కంటోన్మెంట్‌లో సర్వే సత్యనారాయణ నామినేషన్ వేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. మల్కాజ్‌గిరి ఎంపీగానూ పోటీ చేస్తానని మరో బాంబ్ పేల్చారు సర్వే సత్యనారాయణ. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ నారాయణను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సర్వే కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేయడంతో కంటోన్మెంట్ రాజకీయం రసవత్తరంగా మారింది.

సీనియర్లను కాదని.. వలస నేతలా..?

40 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు సర్వే సత్యనారాయణ. తనను కాదని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒకసారి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా, 2 సార్లు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశానని, కేంద్రంలో మంత్రిగా కూడా పని చేశానని గుర్తుచేశారు. తాను మల్కాజ్‌గిరి పార్లమెంట్‌తోపాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించానన్నారు సర్వే. తనను కాదని ఇతర పార్టీలు రిజెక్ట్ చేసిన క్యాండిడెట్లకు టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గెలిచే గుర్రాలకు టికెట్ ఇవ్వకుండా గుడ్డి, కుంటి గుర్రాలకు టికెట్ ఇవ్వడమేంటన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అనుభవం లేదా..? లేక చెప్పుడు మాటలు వింటున్నాడా..? అని ప్రశ్నించారు.

మాదిగలు గుణపాఠం చెప్తారు..

కాంగ్రెస్ పార్టీ మాదిగలను పూర్తిగా విస్మరించిందన్నారు సర్వే సత్యనారాయణ. ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. హైకమాండ్‌లో తనకు గుర్తింపు ఉన్నా.. ఇక్కడి నాయకులు వారి సొంత లాభాల కోసం ఇతరులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు, కార్యకర్తలు తన వెంబడే ఉన్నారని.. ఈ ఎన్నికల్లో తన సత్తా చూపిస్తానని సర్వే హెచ్చరించారు.

ఉపఎన్నికకు 27 నామినేషన్లు

కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజున బుధవారం 10 మంది 14 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా ఉప సమరం కోసం 27 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే, దివంగత లాస్య నందిత సోదరి లాస్య నివేదిత పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున టీఎన్ వంశీ తిలక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ శ్రీ గణేష్‌కు టికెట్ ఇచ్చినా.. సర్వే సత్యనారాయణ రెబల్‌గా బరిలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News