సంధ్యా శ్రీధర్ రావు మళ్ళీ అరెస్ట్ - ఈసారి అమితాబచ్చన్ బంధువుకి కుచ్చుటోపి

శ్రీధర్ రావుపై దాదాపు 30 పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా భూముల లావాదేవీల వ్యవహారంలో అనేక చీటింగ్ కేసులు ఉన్నాయి.

Advertisement
Update:2023-02-20 11:33 IST

ప్రముఖ మోసగాడిగా పేరు తెచ్చుకున్న సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు మరోసారి అరెస్టు అయ్యారు. ఈసారి ఢిల్లీ పోలీసులు పట్టుకెళ్లారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకునే శ్రీధర్ రావు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖుల్ని మోసం చేస్తున్నారు.

ఇదివరకే ఆయన మూడు సార్లు అరెస్టు అయ్యారు. తాజాగా బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ బంధువైన ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నాలుగోసారి అరెస్టు అయ్యారు. గచ్చిబౌలి వచ్చిన ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి శ్రీధర్ రావును తీసుకెళ్లారు. అమితాబచ్చన్ బంధువైన ఒకరి నుంచి ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో కోట్లాది రూపాయలను శ్రీధర్ రావు వసూలు చేసినట్టు చెబుతున్నారు. ఆ డబ్బుతో ట్రాక్టర్లు ఇప్పించకపోగా తిరిగి డబ్బు చెల్లించకుండా మోసం చేశాడు. దాంతో అమితాబచ్చన్ బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు ఆధారంగానే ఢిల్లీ పోలీసులు గచ్చిబౌలి వచ్చి శ్రీధర్ రావును అరెస్టు చేసి తీసుకెళ్లారు. శ్రీధర్ రావుపై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ అల్లుడిని ఇదే తరహాలో డబ్బు వసూలు చేసి మోసం చేసినట్టు ఒక కేసు నమోదు అయింది. శ్రీధర్ రావు ఏపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా పేరు ఉంది. ఆ మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతోనూ ఈయనకు రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు గతంలో బయటకు వచ్చింది. టిడిపి ప్రముఖులతో శ్రీధర్ రావుకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఒక చీటింగ్ కేసులో శ్రీధర్ రావును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా వెంటనే హైకోర్టులో బెయిల్ తెచ్చుకొని బయటికి వచ్చేసారు .

ఈయనపై అసహజ లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది. శ్రీధర్ రావు తనపై అసహజంగా లైంగిక దాడికి ఒడిగట్టారంటూ అతని వద్ద జిమ్ ట్రైనర్‌గా పనిచేసిన ఒక వ్యక్తి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదాంతమూ ఉంది. గచ్చిబౌలిలో ఒక ఈవెంట్ మేనేజర్‌పైన దాడి చేసిన కేసు శ్రీధర్ రావుపై ఉంది.

ముంబైకి చెందిన ఒక రియల్టర్ కూడా గతంలో శ్రీధర్ రావు చేతిలో మోసపోయారు. ఈయనపై దాదాపు 30 పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా భూముల లావాదేవీల వ్యవహారంలో శ్రీధర్ రావుపై అనేక చీటింగ్ కేసులు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News