బీఆర్‌ఎస్ పాపంతోనే సాగర్ ఎడమ కాలువకు గండ్లు
కాలువల నిర్వహనను గాలికొదిలేశారు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాపమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను నిర్లక్ష్యం చేశారని, అందుకే ఈ దుస్థితి సంభవించిందని ఆరోపించారు. సాగర్ ఎడమ కాలువకు పడ్డ గండ్లను మంగళవారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. కాగితం రామచంద్రాపురం, రంగుండ్లలో కాలువకు గండ్లు పడటం కాలువల లోపభూయిష్టమైన నిర్వహణకు పరాకాష్ట అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 700 మంది ఇంజనీర్లు, 1,800 మంది లష్కర్ లను నియమించనున్నామని, గురువారం జలసౌధలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి నియామకపు పత్రాలు అందజేస్తామని తెలిపారు. వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ ప్రకటించిన మరుక్షణం నుంచే అధికారులను అప్రమత్తం చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టామన్నారు. షార్ట్ టెండర్లు పిలిచి గండ్లకు రిపేర్లు చేశామని, బుధవారం ఉదయమే ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తామన్నారు. వరదలను బీఆర్‌ఎస్ రాజకీయం చేయడం తగదన్నారు.