బిల్లుపై వివరణ: గవర్నర్ ఏం అడిగారు..? ప్రభుత్వం ఏం చెప్పింది..?
గవర్నర్ అభ్యంతరాలు తెలిపారు, ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మరోవైపు కార్మికులు తమకు న్యాయం చేయాలంటూ గవర్నర్ తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాల్ గవర్నర్ కోర్టులో ఉంది. ప్రభుత్వం సమాధానాలు పంపించింది కాబట్టి, ఇక గవర్నర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఆర్టీసీ బిల్లు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈరోజు అసెంబ్లీ చివరిరోజు కావడం, ఈరోజు బిల్లుకి ఆమోదముద్ర పడకపోతే అది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆర్టీసీ కార్మికులు, గవర్నర్ కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు, రాజ్ భవన్ ని ముట్టడించారు. ఈ దశలో గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వివరణ కాపీని రాజ్ భవన్ కు పంపించింది.
గవర్నర్ అడిగిన ప్రశ్నలేంటి..?
1. 1958 నుండి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్ లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.
2. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు.
3. భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వారికి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా..?
4. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గా పెన్షన్ ఇస్తారా..? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు అందుతాయా..?
5. ప్రభుత్వ ఉద్యోగుల లో కండక్టర్, కంట్రోలర్ లాంటి పోస్టులు లేవు. మరి వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..?
ప్రభుత్వం సమాధానాలు..
గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రతి ప్రశ్నకు వివరణాత్మకంగా సమాధానం ఇస్తూ ఆ కాపీని రాజ్ భవన్ కు పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్ లైన్స్ లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, IX వ షెడ్యూల్ సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ ఎలా పరిష్కరించిందో అలాగే ఇక్కడ కూడా పరిష్కరిస్తామని వెల్లడించింది.
బాల్ గవర్నర్ కోర్టులో..
గవర్నర్ అభ్యంతరాలు తెలిపారు, ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మరోవైపు కార్మికులు తమకు న్యాయం చేయాలంటూ గవర్నర్ తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాల్ గవర్నర్ కోర్టులో ఉంది. ప్రభుత్వం సమాధానాలు పంపించింది కాబట్టి, ఇక గవర్నర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.