కేసీఆర్ కొట్టే దెబ్బ ఎట్లుంటదో రేవంత్ కు తెలియదు

కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం కాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్ల కి రావాలని కేటీఆర్‌ సవాల్‌

Advertisement
Update:2025-02-01 18:12 IST

కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.కేసీఆర్ కట్టె లేకుండా నడవడం పక్కన పెట్టు… దమ్ముంటే నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడపాలంటూ రేవంత్ కే కేటీఆర్ సవాల్ విసిరారు. 71 సంవత్సరాల పెద్ద మనిషి నాయకుడిని పట్టుకొని కట్టె పట్టుకొని నిలబడమంటూ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నిలబెట్టినవాడు కేసీఆర్ అనే విషయం గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి కి సూచించారు.పరిగిలోని దాస్య నాయక్ తండాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ తర్వాత జరిగిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారుకేసీఆర్ కొట్టేదెబ్బ ఎట్లుంటదో రేవంత్ కు తెలియదు. ఎట్లా ఉంటదో రేవంత్ రెడ్డి ఆయన పాత గురువును అడగాలి. కేసీఆర్ దెబ్బ కొడితే ఎట్లుంటదో రేవంత్ రెడ్డి కొత్త బాస్ రాహుల్ వాళ్ళ అమ్మని అడగాలన్నారు. రేవంత్ రెడ్డి హనీమూన్ పిరియడ్ ముగిసింది, ఆయనకు ఇక పైన సినిమా చూపిస్తామన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం కాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్ల కి రావాలని సవాల్‌ విసిరారు.రేవంత్ రెడ్డి వచ్చినా రాకున్నా కొడంగల్ కు మాత్రం త్వరలో నేను వస్తున్నా… నీకు దమ్ముంటే ఆపుకోమని కేటీఆర్‌ సవాల్ చేశారు.

సీఎం తన పోలీసు బలగంతో నన్ను ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కచ్చితంగా కొడంగల్ పోతాం నీ సంగతి చూస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా సిరిసిల్లతోపాటు మంత్రుల నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేదా? అప్పుడు ఇదే పోలీసులను పెట్టి సమావేశాలకు రక్షణ కల్పించిన విషయం రేవంత్ మర్చిపోయాడు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అయన కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రిలు పనిచేసిన విషయాన్ని సీఎం గుర్తుపెట్టుకోవాలన్నారు.రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బూతు పురాణం మానేసి పరిపాలన పైన దృష్టి సారించాలని హితవు పలికారు.రేవంత్ రెడ్డి మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ జేజమ్మలు దిగివచ్చినా కేసీఆర్ పేరును చెరపడం ఎవరి సాధ్యం కాదన్నారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా అభివృద్ధి చేసిన నాయకుడిగా ఆయన పేరు చరిత్రను నిలబడిపోతుందన్నారు.

రైతులకు మేము ఇచ్చిన రుణమాఫీ పైన, రైతుబంధు భరోసాపైన… మా పార్టీ గత పది సంవత్సరాల ప్రభుత్వం పైన అనేక అబద్ధాలు ముఖ్య మంత్రి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం లేదు… అబద్ధాలు చెప్పకుంటే ఆయన తల పగిలిపోతుందన్న శాపం మీద రేవంత్ రెడ్డికి ఉన్నట్లు ఉన్నదని సెటైర్‌ వేశారు. మేము టింగ్ టింగ్ మని వేలకోట్ల రూపాయలు రైతన్న ఖాతాలో ఇస్తే… రేవంత్ రెడ్డి టకీ టకీ అని రైతుబంధు వేస్తున్నామని చెప్పే అబద్ధాలు చెబుతున్నాడు.రైతన్నలకు, ఆడబిడ్డలకకు, విద్యార్థులకు టకి టకీ మని డబ్బులు పడుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందికి కూడా టకీ టకీ మని జీతాలు కూడా పడడం లేదు. ముఖ్యమంత్రి టకీ టకీ మని అబద్ధాలు చెబుతున్నాడు.

ముఖ్యమంత్రి రేవంత్ మాదిరి మేము తిట్టడం మొదలుపెడితే తట్టుకోలేడు. రైతు భరోసా ఇస్తామని హమీ ఇచ్చిన రైతుబంధు ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 73,000 కోట్ల రూపాయలను రైతన్నల ఖాతాల్లోకి వేసిన నాయకుడు కేసీఆర్. 13 నెలల కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క రైతుబంధు అప్పటి మన ప్రభుత్వం ఇద్దామనుకున్న డబ్బులని అడ్డుకొని ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు…ఇదే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్లి ఆపి ప్రభుత్వం వచ్చినా 6 నెలలు రైతన్నలకు గోసపెట్టి రైతుబంధు వేశారు. ఇప్పటిదాకా కొత్తగా ఒక్క రూపాయి కూడా రైతుబంధు ఇయ్యలేదు .ఒక్కొక్క ఎకరానికి రైతుబంధు రూపంలోనే 17500 చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది .కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతుబంధు వేస్తామంటూ డ్రామా వేస్తున్నాడుఎన్నికల తర్వతా మళ్ళీ కాంగ్రెస్ నేతలు మాయం అవుతారన్నారు.

 ఈరోజు పరిగికి వస్తే అక్కడ నుంచి కొడంగల్ పోతారు అన్న భయంతో రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్పించే కుట్ర చేసిండు..అంబేద్కర్ దీర్ఘ దృష్టి వల్లనే, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఆయన మేధా సంపత్తులను చూసి ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా పిలిపించుకొని జ్ఞానాన్ని పంచుకున్నాయి. కానీ మన దేశంలో మాత్రం కేవలం ఒకే సామాజికవర్గానికి చెందినట్టుగా చిత్రీకరించి ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు ఒక గిరిజన తండాలోని యువకులు అంబేద్కర్ వారసత్వం స్ఫూర్తిగా ఆయనను స్మరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం.. అందులో నన్ను పాల్గొనమని ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నాను. అంబేద్కర్ గారి ఆలోచనల వల్లనే ప్రతి ఒక్క ఆడబిడ్డ కి, 18 సంవత్సరాలు నిండిన పౌరుడికి ఓటు హక్కు దక్కింది. ఈరోజు దేశంలో స్వతంత్రంగా తమ ఆలోచనలను పంచుకునే వాక్ స్వతంత్రాన్ని కల్పించింది అంబేద్కరే. వారు ఇచ్చిన హక్కులతో ప్రజలను మోసం చేస్తున్న పాలకుల పైన తిరగబడే హక్కు మనకున్నది. వారిని ప్రశ్నిస్తే మనపైన చేసే దమనకాండను భరించాల్సిన అవసరం లేదు. చట్టాల మేరకు మన హక్కుల మేరకు పోరాటం చేద్దాం .పోరాడి సాధించుకున్న తెలంగాణను గత పది సంవత్సరాలలో ఒక పసిపాప మాదిరి సాదుకొని అద్భుతంగా అభివృద్ధి చేశాం. కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలు, కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకొని సంక్షేమ పదాలను ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసాం. 10 సంవత్సరాల పాటు అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరి ముందుకు తీసుకుపోయాం

Tags:    
Advertisement

Similar News