రాజ్యసభకు రేణుక, అనిల్ కుమార్ యాదవ్
రేణుకా చౌదరిని రాజ్యసభకు ఎంపిక చేయడంతో ఖమ్మం లోక్‌సభ సీటు రేసు నుంచి ఆమెను తప్పించినట్లయింది. ఇక ఖమ్మం సీటు రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.
ఎగువ సభ అభ్యర్థుల ఎంపిక సస్పెన్స్‌కు ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఒక స్థానానికి ఎంపిక చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. మరో అభ్యర్థి విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది.
రెండో స్థానానికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. అంజన్ కుమార్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009-14 మధ్య సికింద్రాబాద్ ఎంపీగా పని చేశారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. అయితే ఈ సారి సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని అందరూ ఊహించారు. కానీ, అనూహ్యంగా ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభకు ఎంపిక చేసింది.
రేణుకా చౌదరిని రాజ్యసభకు ఎంపిక చేయడంతో ఖమ్మం లోక్‌సభ సీటు రేసు నుంచి ఆమెను తప్పించినట్లయింది. ఇక ఖమ్మం సీటు రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.
ఇక తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ 2న ఖాళీ కానున్నాయి. జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్‌కు ఒక రాజ్యసభ స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.