మళ్లీ ప్రొటోకాల్ రగడ.. ఈసారి ఫొటో కూడా తీసేశారు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అధికారిక కార్యక్రమాల్లో గౌరవం ఇవ్వకుండా వారిని డమ్మీలుగా మార్చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వారిపై ఒత్తిడి తెచ్చి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకునేలా చేస్తున్నారు.

Advertisement
Update:2024-07-17 12:26 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వం అవమానిస్తోందని, ప్రొటోకాల్ విషయంలో తీవ్ర వివక్ష చూపిస్తోందని నిన్న(మంగళవారం) అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదులందాయి. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినా కూడా నియోజకవర్గాల్లో వారి పెత్తనమే కొనసాగుతోందని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదెక్కడి సంప్రదాయమని ప్రశ్నిస్తున్నారు. ఓడిపోయిన వారిపై అంత ప్రేమ ఉంటే.. వారు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ప్రొటోకాల్ రగడ జరగడం విశేషం. అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఫొటో లేదంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు వారికి సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఇటీవల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విషయంలో కూడా ఇలాంటి అవమానమే జరిగింది. ఎమ్మెల్యేగా తాను ఉన్నా కూడా తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన అభ్యర్థిని పిలవడమేంటని ఆమె అధికారుల్ని నిలదీశారు. అధికారిక కార్యక్రమంలో నేలపై కూర్చుని నిరసన తెలిపారు. అంతకు ముందు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ఇలానే జరిగింది. తాజాగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో బోనాల పండగ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఫొటో తీసేశారు. కాంగ్రెస్ నాయకులతో ఫ్లెక్సీలు వేయించుకున్నారు. ఇది పార్టీ కార్యక్రమం కాదని, అధికారిక కార్యక్రమం అని, స్థానిక నాయకులకు గౌరవం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు కార్పొరేటర్ సామల హేమ. బీఆర్ఎస్ నేతలతో కలసి ఆమె నిరసన తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఓవైపు హాట్ టాపిక్ గా మారగా, మరోవైపు బీఆర్ఎస్ కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు అధికారిక కార్యక్రమాల్లో గౌరవం ఇవ్వకుండా వారిని డమ్మీలుగా మార్చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వారిపై ఒత్తిడి తెచ్చి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు బీఆర్ఎస్ ని వీడేది లేదంటున్నారు. కేసీఆర్ వెంట నడిచేవారిపై కాంగ్రెస్ నేతలు పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో అవమానిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News