సెంట్రల్‌ లైబ్రరీలో నిరుద్యోగులపై లాఠీఛార్జ్‌

నాడు సెంట్రల్ లైబ్రరీకి రాహుల్‌ను తీసుకెళ్లి ఓట్లు కొల్లగొట్టారని.. ఇవాళ అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు.

Advertisement
Update:2024-07-15 21:29 IST

తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీ నుంచి ర్యాలీకి సిద్ధమైన నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. సెంట్రల్‌ లైబ్రరీ నుంచి నిరుద్యోగులు బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేశారు పోలీసులు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నిరుద్యోగులు.

సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మాజీ మంత్రి హరీష్‌ రావు. పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. గ్రూప్స్‌, డీఎస్సీ, అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రజా పాలన అంటే ఇదేనా.. ఇందిరమ్మ రాజ్యం ఇదేనా.. అని రేవంత్‌ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. నాడు సెంట్రల్ లైబ్రరీకి రాహుల్‌ను తీసుకెళ్లి ఓట్లు కొల్లగొట్టారని.. ఇవాళ అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. విద్యార్థులపై దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


కొద్ది రోజులుగా తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. డీఎస్సీ పోస్టుల పెంపుతో పాటు పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు గ్రూప్‌ - 2, గ్రూప్‌ -3 పోస్టులు పెంచాలని కోరుతున్నారు. ఇక గ్రూప్‌ - 1లో 1:100గా పరిగణించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే రేవంత్‌ సర్కార్ ఈ డిమాండ్లను అంగీకరించకపోవడంతో నిరుద్యోగులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

శుక్రవారం రాత్రి అశోక్‌ నగర్‌, RTC క్రాస్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో పోటీ పరీక్షల అభ్యర్థులు మెరుపు సమ్మెకు దిగారు. సెక్రటేరియట్‌ ముట్టడికి సైతం ప్రయత్నించారు. ఇక నిరుద్యోగుల ఆందోళనలతో RTC క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్ ఏరియాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Tags:    
Advertisement

Similar News