కూంబింగ్‌ ఆపరేషన్‌ కు పోయినట్టు రైతుల మీదికి పోయిండ్రు

నన్ను అరెస్ట్‌ చేస్తే ఊరికే ఉంటానా.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2024-11-14 18:22 IST

పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ కు పోయినట్టు లగచర్లలో రైతుల మీదికి పోయిండ్రని.. ఒక అమ్మాయి చాతిమీద కాలు పెట్టి ఆమె భర్తను తీసుకెళ్లారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఈ విషయం ఆమె మీడియాకు చెప్తూ ఎంతో ఆవేదన వ్యక్తం చేసిందని అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌ లో లగచర్ల రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో చిట్‌ చాట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. పోలీసులు రేవంత్‌ ప్రైవేట్‌ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టం వచ్చినట్టు కొట్టారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి తన పేరు చెప్పాడని రిమాండ్‌ రిపోర్టులో రాస్తే.. అదంతా బక్వాస్‌ అని ఆయన జైలు నుంచి లేఖ రాశారని అన్నారు. లగచర్లలో భూ సేకరణలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడిందని, దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. 50 మంది రైతులను ఎస్పీ దగ్గరుండి కొట్టించాడని, ఇంతకన్నా అమానుషం ఏముంటుందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ వాళ్లనే టార్గెట్‌ చేసి కొట్టారని తెలిపారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించేందుకు వెళ్లినప్పుడు రైతులు ఈ విషయం వెల్లడించారని తెలిపారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. లగచర్లలో తాము కుట్ర చేస్తే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్‌ చెక్‌ చేసుకోవచ్చన్నారు. అక్కడికి వెళ్తే ప్రజలే ఏం జరిగిందో చెప్తారని అన్నారు.

సురేశ్‌ మా కార్యకర్తే.. ఆయనకు భూమి ఉంది.. పోలీసులది తప్పుడు ప్రచారం

సురేశ్‌ కు భూమిలేకపోయినా గొడవ చేశాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సురేశ్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తేనని.. ఆయనకు భూమి ఉందన్నారు. పోలీసులు, ఐపీఎస్ అధికారులకు ఇంత స్వామి భక్తి వద్దని, నాలుగేళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని, తప్పు చేసిన వాళ్లకు ఏపీలో ఏం జరుగుతుందో ఇక్కడా అదే జరుగుతుందని తేల్చిచెప్పారు. లగచర్ల ఘటన పూర్తిగా ఇంటలిజెన్స్, పోలీసుల వైఫల్యంతోనే జరిగిందన్నారు. తనపై కేసు పెడితే ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంత పిచ్చోడు మరొకరు ఉండరని, జైలు నుంచి వచ్చాక పోరాటం కొనసాగిస్తానని అన్నారు. రైతులపై పోలీసుల దాడిని ఇంతటితో వదిలి పెట్టబోనని.. బాధితులను ఢిల్లీ తీసుకెళ్లి నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కులకు కమిషన్‌ కు ఫిర్యాదు చేస్తామన్నారు. కేసీఆర్‌ మంచి ఉద్దేశంతో ముచ్చెర్లలో ఫార్మా సిటీ తలపెట్టారని, చైనాలో 70 వేల ఎకరాల్లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీని పరిశీలించి వచ్చాకే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎకానమీ ఆఫ్ స్కేల్ అనే ప్రయోజనం ఉండేలా ఫార్మాసిటీని ప్లాన్ చేశారని అన్నారు. ఫార్మాసిటీ కోసం 8 ఏళ్లు కష్టపడి 14 వేల ఎకరాల భూమి సేకరించామన్నారు. కొడంగల్ లో భూ సేకరణకే ఇంత గొడవ జరిగితే ముచ్చర్లలో ఎంతో విలువైన భూములు సేకరించే విషయంలో ఇంకా ఎంత గొడవ జరగాలో ఆలోచించాలన్నారు. తాము రైతులను ఒప్పించి వారికి నచ్చచెప్పి భూసేకరణ చేశామన్నారు.

ఫార్మా విలేజీలకు పర్మిషన్లు తేవడం ఈజీ కాదు

18 నెలలు కష్టపడి, కేంద్రం పెట్టిన అన్ని కండీషన్స్‌ కు ఒప్పుకొని ఫార్మాసిటీకి పర్మిషన్‌ సాధించామన్నారు. అవేవి తెలుసుకోకుండానే ఈ సీఎం ఒక్క ప్రకటనతో ఫార్మాసిటీ రద్దు అని ప్రకటన చేశారని తెలిపారు. ఇప్పుడు రేవంత్‌ ప్రతిపాదిస్తున్న ఫార్మా విలేజ్‌లకు పర్మిషన్‌ రావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందన్నారు. ఫోర్త్‌ సిటీ, ఏఐ సిటీ అని రేవంత్‌ చెప్తున్న మాటలు ఆచరణలో అంత ఈజీ కాదన్నారు. ఒక ప్రాంతంలో ప్రతిపాదించిన పరిశ్రమను మరోచోటికి తరలించడం అంత సులువు కాదని, గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసిన అనుభవంతో ఈ విషయం చెప్తున్నానని అన్నారు. వెల్దండలో సీఎం కుటుంబ సభ్యులు, బంధువులకు భూములున్నాయని, వాటి కోసం ఫార్మా విలేజ్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దందాకు తెరతీశారని అన్నారు. ఫార్మా సిటీ వస్తే ఆ ప్రాంతమంతా కాలుష్యమయం అవుతుందని గతంలో ప్రజల మనసుల్లో వీళ్లే విషం నింపారని గుర్తు చేశారు. ఇప్పుడు కొడంగల్ లో ఫార్మా విలేజ్ తో అమృతం వస్తుందా? ఇదే విషయం ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి సొంత నియోజకవర్గంపైనే పట్టు లేదన్నారు. సీఎం నియోజకవర్గంలో కలెక్టర్‌ పై దాడి చేసేటంత బలవంతులమా తాము అని పశ్నించారు. అదే నిజమైతే ఈ ప్రభుత్వం ఉండి ఎందుకు అన్నారు.

ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే హరీశ్‌ లా కష్టపడాలి

ప్రాజెక్ట్ లు, పెట్టుబడులు తేవాలంటే ఎంతో కష్టపడాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రాజెక్ట్ లు పూర్తి చేసేందుకు హరీశ్‌ రావు ఎంత కష్టపడ్డారో గుర్తు లేదా అన్నారు. వీళ్లకు ప్రభుత్వాన్ని నడపటం చేతకావడం లేదని, ప్రాజెక్టులు ఎలా పూర్తి చేయాలో తెలియదన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారని, గతంలో తాము ఈ ప్రాజెక్టుకు రూ.11 వందల కోట్లతో ప్రతిపాదించామని తెలిపారు. ప్రైవేట్‌ సంస్థలు ఏ లాభం లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తాయా చెప్పాలన్నారు. పేదల ఇండ్లు కూల్చేసి పెద్ద భవంతులు కడితే వాటి నుంచి మురుగు నీళ్లు రావా అని ప్రశ్నించారు. డీపీఆరే లేని ఆ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీకి మూటలు పంపేందుకే ఈ ప్రాజెక్టు తలపెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టే మార్పు వచ్చిందన్నారు. తాము ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఇతర పనులకు వాడుకోవడానికి వీల్లేదన్నారు. ఈ ప్రభుత్వం ఫోర్త్‌ సిటీ కోసం ఒక్క ఎకరం భూమి అయినా సేకరించిందా అని నిలదీశారు. తాను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశానే తప్ప బీజేపీతో దోస్తీ కోసం కాదన్నారు. తమకు బీజేపీతో దోస్తీ అవసరమే లేదన్నారు. కాంగ్రెస్‌ తో బీజేపీ నేతలు ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని అన్నారు.

రేవంత్‌కు నేనంటి ప్రేమ అందుకే టార్గెట్‌ చేస్తున్నడు

రేవంత్ రెడ్డికి తానంటే చాలా ప్రేమ ఉన్నట్లు ఉందని, అందుకే తనను టార్గెట్ చేస్తున్నాడని తెలిపారు. తాను డ్రగ్స్ తీసుకోలేదు.. ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు.. అవినీతి అంతకన్నా చేయలేదన్నారు. ''మోడీనే మోడీయా బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను.. చిట్టి నాయుడికి కూడా అదే చెబుతున్నా…ఏం పీక్కుంటావో పీక్కో.. ఎంత ధైర్యం ఉంటే నేను ఈ మాట అనగలుగుతాను. నిజాయితీకి ఉన్న ధైర్యమే అది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అంటున్నడు. ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో.. నీ పదవికి ఎసరు పెట్టటానికి నల్గొండ, ఖమ్మం బాంబులు వేచి చూస్తున్నాయి.. సొంత నియోజకవర్గం మీద కూడా పట్టు లేని నువ్వు అసలు ఏం సీఎంవి.. కేసీఆర్‌ చేసిన అభివృద్ధితో రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరిగాయి.. వాళ్లకు ఆ భూములే ఆసరా.. అలాంటి భూములను గుంజుకుంటా అంటే వారికి కోపం రాదా? అధికారం పోయిందని నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేదు. అసలు అధికారం వస్తుందని కలలో కూడా నేను ఊహించలేదు.. పదేళ్లు ప్రజలు మాకు అవకాశం ఇవ్వడాన్ని అదృష్టంగా భావించా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని నేను కోరుకుంటున్న.. అప్పుడే బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ల పాటు ఉంటది.. ఎన్నికల సంస్కరణాలు చేస్తే ఒక వ్యక్తి రెండు టర్మ్ ల కన్నా ఎక్కువ సార్లు సీఎం, పీఎం ఉండకుండా తేవాలని తాను కోరుతా..'' అన్నారు.

Tags:    
Advertisement

Similar News