కౌశిక్ అంటే సీఎం రేవంత్ కు భయం పట్టుకుంది
దళితబంధు లబ్ధిదారులకు సాయం విడుదల చేయాలని కోరడం నేరమా? : కేటీఆర్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్ లో కౌశిక్ పై పోలీసుల దాడిని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. ఎమ్మెల్యేపైనే పోలీసులు అమానుషంగా దాడి చేస్తారా అని మండిపడ్డారు. దళితబంధు లబ్ధిదారులకు రెండో విడత నిధులు విడుదల చేయాలని కోరడం ఆయన చేసిన నేరమా? ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక వారికి మిత్తీతో సహా చెల్లిస్తామన్నారు. హామీలు అమలు చేయడం చేతకాకనే రేవంత్ ప్రభుత్వం దాడుల సంస్కృతికి తెరతీసిందన్నారు. ప్రజాప్రతినిధులపై దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గాంధీతో గుండాగిరి చేయించి కౌశిక్ దాడికి సీఎం ప్రయత్నించారని, అయినా కౌశిక్ వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాడుతుండటంతో పోలీసులతో దాడి చేయించాడన్నారు. ప్రశ్నిస్తే భయపడి దాడులు చేయిస్తున్న ఇంతటి పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బీఆర్‌ఎస్ సైనికులు భయపడబోరన్నారు. కౌశిక్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలన్నారు.