మోడీ హామీ ఓట్ల కోసమేనా?
తెలంగాణలో 18 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. వర్గీకరణకు అనుకూలంగా హామీయిస్తే కనీసం మాదిగల ఓట్లన్నా పడి బీజేపీ అభ్యర్థులు ఎక్కడో ఒకచోట గెలవకపోతారా అన్న ఆశ ఉన్నట్లుంది.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారానికి వచ్చిన మోడీ మాదిగల విశ్వరూప సభలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు తొందరలోనే కమిటీ వేయబోతున్నట్లు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను అభినందించారు.
బహిరంగసభలో పాల్గొనేందుకు వేదిక మీదకు మోడీ చేరుకోగానే కృష్ణ మాదిగ ఉద్వేగానికి గురయ్యారు. మోడీ పక్కనే కూర్చున్న కృష్ణ కన్నీళ్ళను ఆపుకోలేకపోయారు. దాంతో కృష్ణను మోడీ చాలాసేపు భుజంతట్టి సముదాయించారు. అలాగే సభ అయిపోయిన తర్వాత కృష్ణను మోడీ దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఇదంతా చూసిన వాళ్ళకు కాస్త నాటకీయంగా అనిపించింది. దాంతో మోడీ ప్రకటించిన ఎస్సీ వర్గీకరణ ప్రకటన కూడా ఎన్నికల స్టంటేనే అనే అనుమానాలు పెరిగిపోయాయి.
ఎందుకంటే మోడీ అనేక సందర్భాల్లో ప్రకటించిన అనేక హామీలు ఆచరణలోకి రాలేదనే సెటైర్లు పెరిగిపోతున్నాయి. 2014 ఎన్నికల్లో ఏపీ ప్రయోజనాల కోసం మోడీ ఇచ్చిన హామీలను ఉదాహరణగా నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎస్సీ వర్గీకరణ అన్నది దశాబ్దాలుగా పెండింగులో ఉన్న సమస్య. ఎస్సీ వర్గీకరణ జరగాలని మాదిగలు డిమాండ్ చేస్తుంటే, చేయకూడదని మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అన్నది తేనెతుట్టె లాగ తయారైంది కాబట్టే ఏ ప్రభుత్వం కూడా దీన్ని ముట్టుకోవటంలేదు.
ఇప్పుడు కూడా మోడీ ఎందుకు హామీ ఇచ్చారంటే రాబోయే ఎన్నికల్లో ఎస్సీల్లోని మాదిగల ఓట్ల కోసమే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో 18 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. వర్గీకరణకు అనుకూలంగా హామీయిస్తే కనీసం మాదిగల ఓట్లన్నా పడి బీజేపీ అభ్యర్థులు ఎక్కడో ఒకచోట గెలవకపోతారా అన్న ఆశ ఉన్నట్లుంది. ఎందుకంటే తెలంగాణలోని ఎస్సీల్లో మాదిగల జనాభానే ఎక్కువ. అందుకనే మాలల ఓట్లు వ్యతిరేకం అవుతాయని తెలిసీ మాదిగల మద్దతు కోసం ఎస్సీ వర్గీకరణకు మోడీ బహిరంగసభలో హామీ ఇచ్చింది. మరి మోడీ వ్యూహం వర్కవుటవుతుందా? ఏమో చూడాలి.
♦