బీజేపీతో కలహమా..? కాపురమా..?? నేడు ఢిల్లీకి పవన్
పవన్ తో ఓసారి భేటీ అయిన కిషన్ రెడ్డి.. పోటీ నుంచి విరమించుకోవాలన్నారు. కాదు కుదరదు అనే సరికి ఈ రోజు ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నారు.
బీజేపీతో విడిపోకముందే టీడీపీతో స్నేహం మొదలుపెట్టారు పవన్ కల్యాణ్. అయితే అధికారికంగా ఆయన బీజేపీకి దూరమయ్యారా లేదా అనేది మాత్రం తేలలేదు. టీడీపీతో పొత్తుపై అటు బీజేపీ కూడా స్పందించలేదు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీ వ్యవహారాన్ని చూడొచ్చు అని కులాసాగా ఉంది కమలదళం. తెలంగాణ ఎన్నికలకు టీడీపీ వెనకడుగు వేసినా, జనసేన మాత్రం 32 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించింది. దీంతో పొత్తు ధర్మం ప్రకారం బీజేపీ నేతలు పవన్ తో ఓసారి భేటీ అయ్యారు. ఆయన ఆలోచించి చెబుతానన్నారు. ఇప్పుడు ఇదే విషయంపై ఢిల్లీలో కీలక మీటింగ్ జరుగుతుందని సమాచారం. ఎల్లో మీడియా ఈ మీటింగ్ ని ధృవీకరించింది కాబట్టి.. ఇది పక్కా అని అనుకోవాల్సిందే. అయితే ఢిల్లీలో పవన్ తో సమావేశమయ్యేవారు ఏ స్థాయి నేతలనేదే ఇక్కడ అసలు విషయం.
ఢిల్లీ వెళ్లి అమిత్ షా లేదా నడ్డాతో పవన్ భేటీ అయ్యారంటే.. ఏపీ వ్యవహారంలో కూడా ఓ స్పష్టత వచ్చినట్టే అనుకోవాలి. అక్కడ కూడా ఆయన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో కలసి వచ్చారంటే మాత్రం ఆ మీటింగ్ లో పసనలేదని అనుకోవాలి. ఆమాత్రం మీటింగ్ హైదరాబాద్ లో పెట్టుకోవచ్చు, లేదా జూమ్ లో కూడా కానిచ్చేయొచ్చు. మరి పవన్ ఎవరిని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నారనేదే ఆసక్తిగా మారింది.
జనసేనకు సీట్లిస్తారా..?
గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనను సైలెంట్ చేసి, వారి ఓట్లను కూడా కొంతమేర బీజేపీ దక్కించుకుంది. ఇప్పుడు సెటిలర్ల నియోజకవర్గాలపై జనసేన ఆశలు పెట్టుకుంది. టీడీపీతో చెలిమి కూడా తమకు కలిసొస్తుందనే అంచనాతో ఉంది. గెలిచినా గెలవకపోయినా.. తెలంగాణలో జనసేన ఉనికి చాటుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగం ఉంటుందనేది పవన్ ఆలోచన. అందుకే జనసేన అభ్యర్థులను బరిలో దింపుతానంటున్నారు. అయితే బీజేపీ ఈ పోటీని ఊహించలేదు. అందుకే పవన్ తో ఓసారి భేటీ అయిన కిషన్ రెడ్డి.. పోటీనుంచి విరమించుకోవాలన్నారు. కాదు కుదరదు అనే సరికి ఈరోజు ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నారు. ఒకట్రెండు స్థానాల్లో అయినా బీజేపీ సపోర్ట్ తో జనసేన అభ్యర్థులు బరిలో దిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉమ్మడి పోటీపై ఈ రోజు తుది నిర్ణయం వెలువడుతుంది. తెలంగాణలో బీజేపీ-జనసేన కలసి పోటీ చేస్తే.. ఏపీలో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశాలున్నాయనుకోవాలి.