రాష్ట్ర పక్షి పాలపిట్ట.. అంతరించబోయే దశలో ఉంది.. కాపాడుకుందాం
హైదరాబాద్ మహానగర పరిధిలో గత ఏడాది 300 పాలపిట్టలు ఉన్నాయని అంచనా వేశారు. ఇప్పుడు వాటి సంఖ్య 200కు పడిపోయింది.
పాలపిట్ట.. దసరా పండగకు ప్రత్యేకం. పాలపిట్టను చూడటం దసరాకు ఆనవాయితీ. ఆ ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం దాన్ని రాష్ట్ర పక్షిగా గుర్తించి గౌరవం కల్పించింది. అయితే ఇంతటి ప్రాధాన్యమున్న పాలపిట్టలు క్రమంగా అంతరించపోతుండటం ఆందోళనకరం. అందరం కలిసి దాన్ని కాపాడుకోవాలని స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ నివేదిక ఘోషిస్తోంది.
బంధించి, సొమ్ము చేసుకోవాలనే ఆశతో బలి చేస్తున్నారు
దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని తెలంగాణలో నమ్మిక. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది పాలపిట్టలను బంధించి, పంజరాల్లో పెట్టి ప్రజలకు చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అవి పంజరాల్లో సరిగా ఆహారం, నీరు తీసుకోక, డీహైడ్రేషన్‌తో చనిపోతున్నాయని పక్షిప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలో గత ఏడాది 300 పాలపిట్టలు ఉన్నాయని అంచనా వేశారు. ఇప్పుడు వాటి సంఖ్య 200కు పడిపోయింది.
బంధిస్తే జరిమానా, జైలు శిక్ష
పాలపిట్టలు వన్యప్రాణుల విభాగంలోకి అటవీ చట్టం పరిధిలోకి వస్తాయి. కాబట్టి వాటిని బంధించడం శిక్షార్హమైన నేరం. పాలపిట్టను బంధించినా, హింసించినా నాన్‌బెయిలబుల్ కేసు పెట్టొచ్చు. అంతేకాదు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. చట్టం గురించి కాకపోయినా మన రాష్ట్ర పక్షి.. మన పండగల సందర్భంగా శుభం కలగాలని మొక్కే పాలపిట్టను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది. అందుకే ఎవరైనా వాటిని బంధించి ఉంచితే తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.