కొండా టికెట్‌కు అడ్డుపడుతున్న ఎన్ఆర్ఐ.. టికెట్ రాదేమోననే ఆందోళనలో సురేఖ!

1999, 2004లో శాయంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో శాయంపేట అసెంబ్లీ సెగ్మెంట్ రద్దు కావడంతో.. 2009లో పరకాల నుంచి పోటీ చేసి గెలిచారు.

Advertisement
Update:2023-09-22 09:39 IST

వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన కొండా సురేఖకు.. ఇప్పుడు అదే పార్టీలో టికెట్ కోసం కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్ మరణానంతరం వైసీపీలో చేరి కొన్నాళ్లు.. ఆ తర్వాత బీఆర్ఎస్‌తో ప్రయాణం కొన్నాళ్లు కొనసాగించారు. చివరకు ఇప్పుడు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. కొండా సురేఖ కేవలం పార్టీలు మారడం మాత్రమే కాకుండా.. నియోజకవర్గాలు కూడా తరుచూ మారుస్తుండటం ఆమెకు పెద్ద మైనస్‌గా మారింది.

1999, 2004లో శాయంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో శాయంపేట అసెంబ్లీ సెగ్మెంట్ రద్దు కావడంతో.. 2009లో పరకాల నుంచి పోటీ చేసి గెలిచారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీ నుంచి పోటీ చేసినా గెలవలేదు. 2014 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. 2018లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో జాయిన్ అయి మళ్లీ పరకాల నుంచి పోటీ చేశారు. కానీ ఈ సారి ఓడిపోయారు. ఇక ఇప్పుడు మళ్లీ వరంగల్ ఈస్ట్ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు.

వరంగల్ ఈస్ట్ టికెట్ కోసం కొండా సురేఖతో పాటు 8 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. తనకు తప్పకుండా టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. అయితే ఎన్ఆర్ఐ సామల ప్రదీప్ నుంచి ఆమెకు గట్టి పోటీ ఎదురవుతోంది. వరంగల్‌లోని గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన సామల ప్రదీప్.. రెండున్నర దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. నాటా, ఆటాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. ప్రస్తుతం ఓవర్సీస్ కాంగ్రెస్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి సామల ప్రదీప్ సన్నిహితుడిగా పార్టీలో చెప్పుకుంటున్నారు. అందుకే ఈ సారి వరంగల్ ఈస్ట్ టికెట్ తనదే అనే ధీమాతో ఉన్నారు. ఇన్నాళ్లూ వరంగల్ ఈస్ట్ నుంచి టికెట్ తప్పకుండా వస్తుందని భావించిన కొండా సురేఖకు సామల ప్రదీప్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రిని అయన తనకు టికెట్ రాకుండా కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారని ఆమె అనుమానిస్తున్నారు.

ఇటీవల గాంధీభవన్‌కు వచ్చి కొండా సురేఖ కామెంట్లు చేయడం వెనుక అసహనానికి ఇదే కారణమని తెలుస్తున్నది. ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వొద్దని ఆమె వ్యాఖ్యానించడం వెనుక సామల ప్రదీప్ నుంచి వస్తున్న పోటీనే కారణమని అంటున్నారు. కాగా, ఐదేళ్లకు ఒకసారి నియోజకవర్గాన్ని మారుస్తున్న కొండా సురేఖపై ప్రజలకు కూడా నమ్మకం లేదంటూ కొంత మంది కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.

కేవలం ప్రజలే కాకుండా కొండా అనుచరులు కూడా పదే పదే నియోజకవర్గాలు మార్చడంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సారి ఈస్ట్ టికెట్ వస్తే ఇకపై నియోజకవర్గం మార్చబోమని అనుచరుల వద్ద కొండా దంపతులు ప్రస్తావించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ఆర్ఐకి టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరికలు పంపుతున్నారు. ఇన్నాళ్లు కష్టపడిన వారిని కాదని.. ఎన్నికల ముందు వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తమకు తెలిసిన మార్గాల ద్వారా కొండా సురేఖ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తున్నది. మరి ఆమెకు వరంగల్ ఈస్ట్ టికెట్ వస్తుందో.. లేదంటే సామల ప్రదీప్ ఎసరు పెడతారో కొన్ని రోజుల్లో తెలిసిపోనున్నది.


Tags:    
Advertisement

Similar News