ఫార్ములా-ఈ రేసు కేసులో ఆరోపణలు ఏమిటి?
కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బీఆర్‌ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. బాధ్యతగల అధికారిగా దానకిషోర్ ఫిర్యాదు చేశారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని పీపీ అన్నారు. ఫార్ములా ఈ ఆపరేషణ్స్ సంస్థను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఫార్ములా ఈ కార్ల రేసులో ఎవరెవరికి మధ్య ఒప్పందం జరిగిందని అడిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, పురపాలక శాఖ మధ్య ఒప్పందం కుదిరిందని పీపీ తెలిపారు. పౌండ్ల రూపంలో రూ. 46 కోట్లు చెల్లించినా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదన్నారు. హెచ్‌ఎండీఏ నుంచి 10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలన్నారు. ఎవరి అనుమతి లేకుండానే రూ. 54 కోట్లు చెల్లించారు. ఎన్నికల కోడ్ ఉండగానే రేసు నిర్వహణకు ఒప్పందం చేసుకున్నారు. డబ్బు చెల్లింపులో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించలేదు. డబ్బు చెల్లింపు నోట్ ఫైల్‌లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారని పీపీ వాదించారు.
అనంతరం కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్‌ఐఆర్‌కు వర్తించవు. ఫార్ములా ఈ- రేసు నిర్వహణ ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. ఆ శాఖు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చడం తగదు. కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదు. అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదు అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా పలు తీర్పులను ఆయన ప్రస్తావిస్తూ ఎఫ్‌ఐఆర్ కొట్టవేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.