సాగర్ వివాదానికి తాత్కాలిక పరిష్కారం.. ఏపీ, తెలంగాణ అంగీకారం
కేంద్ర హోం శాఖ ఓ మధ్యే మార్గాన్ని సూచించింది. ఆ పరిష్కారానికి ఏపీ, తెలంగాణ అంగీకారం తెలపడంతో కథ ప్రస్తుతానికి సుఖాంతమైనట్టే చెప్పాలి.
నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఏర్పడిన వివాదానికి తాత్కాలిక తెరపడింది. కేంద్ర హోం శాఖ స్పందించి ఓ మధ్యే మార్గాన్ని సూచించింది. ఆ పరిష్కారానికి ఏపీ, తెలంగాణ అంగీకారం తెలపడంతో కథ ప్రస్తుతానికి సుఖాంతమైనట్టే చెప్పాలి. అయితే రెండు రాష్ట్రాలు ఎంతవరకు సమన్వయంతో ఉంటాయో వేచి చూడాలి. ప్రస్తుతానికయితే ఇరు రాష్ట్రాల పోలీసులు డ్యామ్ పైనుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు.
నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేయడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించడం, బ్యారికేడ్లు పెట్టి, కంచె వేయడంతో తెలంగాణ పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత గొడవ పెద్దదైంది. నిన్న ఉదయం నుంచి డ్యామ్ పై పోలీసులు మోహరించారు. దీంతో కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్ మెంట్ కి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు వెంటనే నీటి విడుదల ఆపేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ దృష్టిసారించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు కూడా పాల్గొన్నారు. సాగర్ జలాల విడుదల విషయంలో నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలని ఆయన ఓ ప్రతిపాదన చేశారు. డ్యామ్ నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని, డ్యామ్ పర్యవేక్షణ సీఆర్పీఎఫ్ కు వదిలేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి. దీంతో వివాదానికి తాత్కాలిక పరిష్కారం లభించినట్టయింది.