ఎస్సీ వర్గీక'రణం'.. విశ్వరూప సభలో మోదీ మార్కు రాజకీయం

Advertisement
Update:2023-11-11 21:37 IST

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహా సభలో మోదీ మార్కు రాజకీయం స్పష్టంగా కనపడింది. వర్గీకరణకు సై అని మోదీ ప్రకటిస్తారేమోనని అందరూ ఆశపడ్డారు. కానీ ఆయన తుస్సుమనిపించారు. వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామంటూ మరోసారి చేసిన వాగ్దానమే మళ్లీ చేశారు. కాకపోతే ఈసారి ఓ అడుగు ముందుకేసినట్టుగా కమిటీ వేస్తున్నామని చెప్పారు మోదీ.


ఎస్సీ వర్గీకరణకోసం మందకృష్ణ మాదిగ 30ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని చెప్పిన మోదీ.. మళ్లీ ఇప్పుడు వర్గీకరణకోసం కమిటీ వేస్తున్నామని చెప్పడం విడ్డూరం. వారిది న్యాయమైన కోరిక అంటూనే మళ్లీ కమిటీతో కాలయాపన దేనికో ఆయనకే తెలియాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మాదిగ వర్గానికి అన్యాయం చేశాయని ఆరోపించారే కానీ, బీజేపీ ఏం చేసిందని చెప్పడానికి మోదీ దగ్గర మాటల్లేవు. కానీ మాదిగ నేతలంతా కలసి వచ్చిన సమావేశం కావడంతో మోదీ ఉత్సాహంగా కనపడ్డారు. దళితులను రాష్ట్రపతిగా చేసింది తామేనని చెప్పారు మోదీ. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది కూడా తామేనన్నారు. పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టింది కూడా బీజేపీ ప్రభుత్వమేనని చెప్పుకున్నారు మోదీ.

వేదికపై ఉద్విగ్న వాతావరణం..

సభా వేదికపై ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మోదీ రెండు చేతుల్ని పట్టుకుని ఉద్వేగానికి లోనయ్యారు మంద కృష్ణ మాదిగ. తమ జాతి ఆకాంక్ష నెరవేరిస్తే దక్షిణాదిలో మోదీకి లక్ష్మణుడిలాగా తాను పనిచేస్తానని చెప్పారు. సభకోసం అన్ని రాజకీయపార్టీలకు చెందిన మాదిగ వర్గం నేతలు వచ్చారని, ఇకపై తమకు ఏ పార్టీ ఉండదని, వర్గీకరణకు బీజేపీ సై అంటే తామంతా ఆ పార్టీకి వెన్నంటి ఉంటామని అన్నారు మంద కృష్ణ మాదిగ. మోదీ ఒక్కసారి మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటారనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. మాదిగల సభకు మోదీ వస్తారని తాము ఊహించలేదన్న ఆయన, తమజాతికోసం వచ్చారంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement

Similar News