రేవంత్ రైతులను నిండా ముంచుతున్నడు
బోనస్ ఇవ్వాల్సి వస్తుందని సన్నవడ్లను ప్రభుత్వం కొనడం లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి రైతులను నిండా ముంచుతున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్తి, వరి పంట సాగు చేసిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం వాటిని కొనడమే లేదని, సిద్దిపేట జిల్లాల్లో గింజ సన్నవడ్లను ఇప్పటి వరకు కొనలేదన్నారు. రూ.2,300 మద్దతు ధర ఉంటే దళారులు రైతుల వద్ద రూ.1,900లకే కొంటున్నారని తెలిపారు. మద్యం అమ్మకాలను టార్గెట్ మేరకు చేయలేదని ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకున్న రేవంత్ రెడ్డి.. వడ్లు కొనని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను రేవంత్ రెడ్డి తాగుబోతుల రాష్ట్రం చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. యాసంగి సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు రైతుబంధు ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలవుతున్నా రుణమాఫీ పూర్తి చేయలేదని, మహారాష్ట్రకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్పారని అన్నారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.