వర్షాలు తగ్గే వరకు ప్రజలకు భరోసా..
తన కార్యాలయం కూడా నిరంతరం అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తన కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు ఎమ్మెల్సీ కవిత.
భారీ వర్షాలు తెలంగాణ వాసుల్ని కలవరపెడుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం కూడా అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తోంది. తన కార్యాలయం కూడా నిరంతరం అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తన కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఆమె ట్వీట్ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో..
వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు భరోసా కల్పించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేసి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఆయన ఆదేశాలతో మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని, కనీస అవసరాలకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశామంటున్నారు కవిత. వైద్యం, ఆహారం, విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం ఎక్కడికక్కడ త్వరితగతిన చర్యలు తీసుకుంటూ అధికారులు ప్రజలకు భరోసానిస్తున్నారని చెప్పారు.