రాహుల్ ని మోదీ ప్రత్యర్థిగా కోరుకునేది అందుకే..! –కవిత
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉందని స్పష్టం చేశారు కవిత. పెద్ద ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ కు పెద్దగా బలం లేదని అన్నారు.
దేశ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో బలమైన కూటమి ఏర్పాటు చేసి బీజేపీని ఎదుర్కోవడమే బీఆర్‌ఎస్ అంతిమ లక్ష్యమని చెప్పారు. బీఆర్‌ఎస్ విస్తరణలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేస్తామని అన్నారు కవిత.
తెలంగాణలో..
తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో ప్రజాబలం లేదని అన్నారు కవిత. అందుకే ఆ పార్టీ తమకు ప్రధాన ప్రత్యర్థి కాదని స్పష్టం చేశారు. దుబ్బాకలో స్వల్ప మెజారిటీ, హుజూరాబాద్ లో ఈటల సొంత బలంతో బీజేపీ గెలిచిందని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రలు వచ్చి ప్రచారం చేసినా పూర్తి మెజారిటీ సాధించలేదనే విషయాన్ని గుర్తు చేశారు కవిత. తెలంగాణలో బీజేపీకి బలంలేదనే విషయం తేలిపోయిందని, కేవలం మాటలతో రెచ్చగొట్టడం ఒక్కటే ఆ పార్టీ నేతల పని అని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పసుపుబోర్డు అంశంపై నాలుగేళ్లుగా టైమ్ పాస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు కవిత.
మోదీ ప్లాన్ అదే..
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉందని స్పష్టం చేశారు కవిత. పెద్ద ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ కు పెద్దగా బలం లేదని అన్నారు. కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. అందుకే రాహుల్‌గాంధీ తన ప్రత్యర్థిగా ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటారని చెప్పారు.
తగ్గేదే లేదు..
తన రాజకీయ ఎదుగుదలని సహించలేక దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని, ఆ విషయంలో తాను తగ్గేదే లేదన్నారు కవిత. తానే తప్పూ చేయలేదని, అందుకే దర్యాప్తు సంస్థల చర్యలకు భయపడేది లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.