ఆ గ్యారెంటీ లేదు.. 'ఇండియా' కూటమిపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
చరిత్ర చూస్తే దేశంలో ఎన్నికలకు ముందు కూటములు పెద్దగా విజయవంతమైన దాఖలాలు లేవని అన్నారు కవిత. అందుకే తాము వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ జాతీయ అజెండాతో పనిచేసే జాతీయ పార్టీ అని స్పష్టం చేశారు.
అధికార ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసి బీజేపీపై యుద్ధానికి సిద్ధం అవుతోంది. ఈ ఏడాది జరగబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కూటమికి సెమీ ఫైనల్స్. ఈ దశలో ఈ కూటమి ఉనికిపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. సార్వత్రిక ఎన్నికల తర్వాత విపక్ష కూటమి ఉనికి ప్రశ్నార్థకమేనని అన్నారామె.
గ్యారెంటీ లేదు..
విపక్ష ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్ధకమేనని అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ కూటమి ఉంటుందో లేదో గ్యారంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. కూటమిలో కుమ్ములాటలు రావడం సహజం అన్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనే సీట్ల సర్దుబాటు సమస్యలు వస్తాయని, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఆ సమస్యలు పెద్దవవుతాయని చెప్పారామె. ఈ సర్దుబాటు సమస్యలతో కూటమిలో లుకలుకలు గ్యారెంటీ అంటున్నారు. అందుకే విపక్ష కూటమి ఎన్నికల తర్వాత ఉనికి కోల్పోతుందన్నారు.
ఆనవాయితీ లేదు..
చరిత్ర చూస్తే దేశంలో ఎన్నికలకు ముందు కూటములు పెద్దగా విజయవంతమైన దాఖలాలు లేవని అన్నారు కవిత. అందుకే తాము వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ జాతీయ అజెండాతో పనిచేసే జాతీయ పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాత్రం కర్నాటకలో ఓ అజెండా, తెలంగాణాలో మరో అజెండా తెరపైకి తెస్తుందని, బీఆర్ఎస్ అలా కాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణకు ఏ మేలూ చేయని బీజేపీకి.. కర్నాటక తరహా ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు. ప్రాంతీయ సమస్యలను ప్రస్తావించి పరిష్కరించగలిగే పార్టీనే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస పాలనను ప్రజలు చూశారని, తమకు హ్యాట్రిక్ విజయం అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు కవిత.