ఈ సారి ఎన్ని సీట్లంటే..? పక్కాగా లెక్క చెప్పిన కేటీఆర్
పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓడిపోతారని చెప్పారు మంత్రి కేటీఆర్. ఈటల రాజేందర్ రెండు చోట్లా ఓడిపోతారన్నారు. ఖమ్మంలో కనీసం 6 స్థానాలు గెలుస్తామని, మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామన్నారు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని సర్వేలన్నీ తేల్చేశాయి. 70నుంచి 82 స్థానాలు బీఆర్ఎస్ కి వచ్చే అవకాశముందంటున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలన్నీ విజయం తమదేనంటున్న వేళ, మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ గెలుచుకోబోయే స్థానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీఆర్ఎస్ 82 స్థానాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పారు. తెలంగాణలో మరోసారి అధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్సేనని, కాంగ్రెస్ గాలి అంతా సోషల్ మీడియాలోనే అని స్పష్టం చేశారు.
వారికి ఓటమి ఖాయం..
పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓడిపోతారని చెప్పారు మంత్రి కేటీఆర్. ఆ పార్టీ సీనియర్లు చాలా మంది పోటీలో ఎదురీదుతున్నారని వెల్లడించారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి, మధిరలో భట్టివిక్రమార్క.. ఇలా చాలామంది ఓడిపోబోతున్నారని చెప్పారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ఈటల రాజేందర్ రెండు చోట్లా ఓడిపోతారన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ గెలవలేరని తేల్చేశారు. కాంగ్రెస్ కి పెట్టనికోటలా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు కేటీఆర్. ఖమ్మంలో కనీసం 6 స్థానాలు గెలుస్తామని, మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామన్నారు. బీజేపీ మళ్లీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందన్నారు కేటీఆర్.
రుణమాఫీకి ఈసీ అనుమతిస్తే వెంటనే పూర్తి చేస్తామని, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్-5న రుణమాఫీ చేస్తామన్నారు కేటీఆర్. నిరుద్యోగుల విషయంలో ఇప్పటి వరకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తున్నామని చెప్పారు. యువతలో విశ్వాసం నింపేందుకు టీఎస్పీఎస్సీలో సంస్కరణలు, ప్రక్షాళనలు చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. పోలింగ్ కి వారం మాత్రమే సమయం ఉందని.. ఈలోగా బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు కేటీఆర్.
తెలంగాణకు ఉన్న ఒకే ఒక గొంతు కేసీఆర్ అని, ఆయన్ను తెలంగాణ దాటి రాకుండా చూడాలని రాహుల్, మోదీ కుట్ర చేస్తున్నారని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ కర్నాటక నుంచి, బీజేపీ గుజరాత్ నుంచి డబ్బుకట్టలు తెస్తున్నాయని, రాహుల్ కైనా, మోదీకైనా దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ, కేసీఆర్ కు తెలంగాణే ఎపిక్ సెంటర్ అని వివరించారు. వాళ్లు తెలంగాణను గెలవాలనుకుంటుంటే, తాము తెలంగాణను గెలిపించుకోవాలనుకుంటున్నామన్నారు కేటీఆర్.