త్వరలోనే VRO, VRA వ్యవస్థ - పొంగులేటి
మొన్నటి వరకు VRO హోదాలో పని చేసిన దాదాపు 5,500 మంది ఉద్యోగులతో పాటు 22 వేల 500 మంది VRAలను సైతం ఇతర శాఖలకు బదిలీ చేశారు.
తెలంగాణలో మళ్లీ VRO, VRA వ్యవస్థ తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో జరిగిన డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామస్థాయి నుంచి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.
అయితే మొన్నటివరకు ఉన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్- VRO, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులను యథావిధిగా ప్రవేశపెడతారా లేక రెండు రకాల పోస్టులను కలిపి ఒకే పోస్టుగా సర్దుబాటు చేసి విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వ్యవస్థను తీసుకువస్తారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నటి వరకు VRO హోదాలో పని చేసిన దాదాపు 5,500 మంది ఉద్యోగులతో పాటు 22 వేల 500 మంది VRAలను సైతం ఇతర శాఖలకు బదిలీ చేశారు. వారందరినీ వెనక్కి పిలుస్తారా లేదా ఆప్షన్ అడిగిన తర్వాత పాత పోస్టులో నియమిస్తారా..? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
గ్రామస్థాయిలో వీఆర్వోలు, వీఆర్ఏల అవినీతి భారీగా ఉందన్న కారణంతో 2020లో ఆ వ్యవస్థను కేసీఆర్ సర్కార్ రద్దు చేసింది. అయితే ఎన్నికల ప్రచారం వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.