ఖమ్మంలో పొలిటికల్ హీట్.. పొంగులేటి వియ్యంకుడి నామినేషన్
తన సతీమణి మల్లు నందినికి టికెట్ కేటాయించలేకపోతే.. రాయల నాగేశ్వర రావుకు టికెట్ ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరినట్లు సమాచారం. అయితే పోంగులేటి సైతం తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే.
తెలంగాణలో నామినేషన్ల స్వీకరణకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతున్న వేళ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి నామినేషన్ వేసి షాకిచ్చారు. రఘురామిరెడ్డి తరపున పొంగులేటి అనుచరులు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ఖమ్మం ఎంపీ సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం. తన సతీమణి మల్లు నందినికి టికెట్ కేటాయించలేకపోతే.. రాయల నాగేశ్వర రావుకు టికెట్ ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరినట్లు సమాచారం. అయితే పోంగులేటి సైతం తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే తన వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి అభ్యర్థిపై అధికారిక ప్రకటన రాకుండానే రఘురామిరెడ్డి నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. రఘురామిరెడ్డి నామినేషన్ వేయడం వెనుక మంత్రి పొంగులేటి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే పొంగులేటి మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని సమాచారం.