ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి హాట్ కామెంట్స్..

తెలంగాణ ఎంసెట్ అంటే దాదాపు లక్ష మంది విద్యార్థులు ఏపీ నుంచి పోటీ పడుతున్నారని, ఇక్కడి విద్యాసంస్థలపై అక్కడివారికి అంత క్రేజ్ ఉందని గుర్తు చేశారు మంత్రి మల్లారెడ్డి.

Advertisement
Update:2023-05-01 15:43 IST

ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు ఉలిక్కి పడ్డారు. వారం రోజులపాటు ఆ ఎపిసోడ్ కొనసాగింది. తాజాగా మంత్రి మల్లారెడ్డి మరోసారి ఏపీలో అధికార పార్టీ నాయకులకు చురుకు పుట్టించారు. ఏపీని అభివృద్ధి చేయాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని, అక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి కనపడుతుందని అన్నారు.

కుల రాజకీయాలు..

ఏపీలో కులరాజకీయాలున్నాయని.. రెడ్డి, కాపు, కమ్మ.. ఇలా ఏ వర్గం వారు ఆ రాజకీయాలు చేసుకుంటున్నారని, సామాన్య ప్రజల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నారు మంత్రి మల్లారెడ్డి. ఏపీలో కూడా కేసీఆర్ పాలన రావాలని, బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఏపీకి కేంద్రం నిధులిచ్చినా పోలవరం పూర్తి కాలేదని, తెలంగాణకు కేంద్రం నిధులివ్వకపోయినా ప్రపంచ దేశాల్ని ఆకర్షించేలా కాళేశ్వరం పూర్తి చేసుకున్నామని చెప్పారు. ఇదంతా కేసీఆర్ పాలన వల్లే జరిగిందన్నారు. కేటీఆర్ ముందు చూపు వల్లే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు. తండ్రీ కొడుకుల వల్లే తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని చెప్పారు.

తెలంగాణ ఎంసెట్ అంటే దాదాపు లక్ష మంది విద్యార్థులు ఏపీ నుంచి పోటీ పడుతున్నారని, ఇక్కడి విద్యాసంస్థలపై అక్కడివారికి అంత క్రేజ్ ఉందని గుర్తుచేశారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో విద్య, వైద్యం, ఉపాధి.. అన్నిరంగాల్లోనూ అభివృద్ధి జరుగుతోందని, అందుకే ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కేసీఆర్ కి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఏపీ ప్రజలు కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనుకుంటున్నారని చెప్పారు. పోలవరం కట్టేది, విశాఖ ఉక్కుని కాపాడేది కేసీఆరే అన్నారు. ఇంకెవరికీ ఆ దమ్ము లేదన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఏపీ రాజకీయాలు, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

Tags:    
Advertisement

Similar News