అది రాబందుల పార్టీ.. మాది రైతుల పార్టీ
రైతుబీమా తెలంగాణలో తప్ప మరెక్కడా అమలులో లేదన్నారు. శాస్త్రీయంగా ఆధారాలుంటేనే మాట్లాడాలి, దుష్ప్రచారం చేయడం సరికాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. పూర్తి ఆధారాలతో మాట్లాడే సత్తా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు కేటీఆర్.
అమెరికా పోతే కొత్త కొత్త ఆలోచనలొస్తాయా..? అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసెంబ్లీలో సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రైతాంగానికి మూడు గంటలు కరెంటు చాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బహిరంగంగా మాట్లాడారని, గతంలో 6 గంటల కరెంట్ ఇచ్చి రైతులను చావగొట్టిన వాళ్లు, ఈసారి అవకాశం ఇస్తే మూడు గంటలే ఇస్తామంటున్నారని మండిపడ్డారు. వరద నష్టం విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రభుత్వానికి నీతులు చెప్పే ముందు.. శ్రీధర్ బాబు వారి పార్టీ విధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను అన్ని రకాలుగా పీడించుకొని రాబందుల్లాగా పీక్కుతింటామని చెప్తారా? ధరణి రద్దు చేస్తాం.. దళారుల ప్రభుత్వం తెస్తామని చెప్తారా? మా అధ్యక్షుడి చెప్పింది తప్పు అని శ్రీధర్ బాబు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్తారా..? అని కేటీఆర్ సభలో నిలదీశారు.
వరి పంటలో రెండు రోజులు నీళ్లున్నా నష్టం జరగదని, సోయా, పత్తి పంటలో నీళ్లుంటే నష్టం జరుగుతుందని, ఇవేవీ తెలియకుండా, ఆలోచించకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తున్నారంటూ శ్రీధర్ బాబుపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ రుణమాఫీ ప్రకటన చేయగానే కాంగ్రెస్ నేతలకు ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు. దీంతో అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రైతులకు 3 గంటలే కరెంట్ ఇస్తామని చెప్పిన వారు మాకు నీతులు చెబుతారా అని ప్రశ్నించారు.
రెండు సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతుబంధు ప్రవేశపెట్టి 73 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో వేశారని చెప్పారు కేటీఆర్. రైతుబీమా తెలంగాణలో తప్ప మరెక్కడా అమలులో లేదన్నారు. శాస్త్రీయంగా ఆధారాలుంటేనే మాట్లాడాలి. దుష్ప్రచారం చేయడం సరికాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. పూర్తి ఆధారాలతో మాట్లాడే సత్తా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు కేటీఆర్.