బీసీ బిడ్డను గెలిపించండి..

డబ్బుల సంచులతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, 11సార్లు అవకాశం ఇస్తే చేసిన అభివృద్ధి శూన్యం అని విమర్శించారు.

Advertisement
Update:2023-11-22 17:43 IST

కోదాడ పట్టణంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్ ని మరోసారి గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కోదాడ ప్రజల్ని చూస్తే ఇక్కడ కచ్చితంగా బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందనే నమ్మకం కుదిరిందని.. ఇది రోడ్ షో లా లేదు, విజయోత్సవ ర్యాలీగా ఉందన్నారు కేటీఆర్. కోదాడ పట్టణంలోని పెద్ద చెరువుని అభివృద్ధి చేస్తానన్నారాయన. పట్టణంలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. కోదాడలో హైటెక్ బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్పారు. దున్నపోతుకి గడ్డి వేసి పాలు రావాలంటే సాధ్యం కాదని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదని చెప్పారు కేటీఆర్.

డబ్బుల సంచులతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, 11సార్లు అవకాశం ఇస్తే చేసిన అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల ముందుకు రావడం విడ్డూరం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయంలో రైతులకు కరెంట్ కష్టాలున్నాయని, ఇప్పుడు రైతులకు 24గంటల విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా.. ప్రజలు ఆలోచించుకోవాలన్నారు కేటీఆర్.

డిసెంబర్ 3న మళ్ళీ కోదాడ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ చేపడతామని చెప్పారు మంత్రి కేటీఆర్. మేనిఫెస్టో హామీలను ఆయన మరోసారి వివరించారు. ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న అందరికీ వచ్చే ఐదేళ్లలో ఐదు వేల రూపాయలకు పెన్షన్ పెంచుతామన్నారు. గ్యాస్ సిలిండర్ రేటుని మోదీ 1200 రూపాయలు చేశారని, అందులో 800 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించిందని చెప్పారు. ఎన్నికల వేళ రైతులకు పథకాల లబ్ధి అందకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుపడ్డారని ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


Tags:    
Advertisement

Similar News