వైద్యరంగంలో దేశానికి దిక్సూచి తెలంగాణ
2014 తర్వాత తెలంగాణ వైద్యరంగంలో వచ్చిన మార్పులను లెక్కలతో సహా వివరించారు కేటీఆర్. 2014లో వైద్యరంగంలో తలసరి హెల్త్ బడ్జెట్ రూ.925గా ఉంటే.. 2023 నాటికి అది 3,532 రూపాయలకు పెరిగిందన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన రంగాల్లో వైద్యారోగ్య రంగం ఒకటన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు జోడించడంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. హెల్త్ సెక్టార్‌లో 2014లో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ 2023 నాటికి మూడో స్థానానికి చేరుకుందన్నారు. ఇది గత 9 ఏళ్లలో వైద్య రంగంలో వచ్చిన మార్పునకు నిదర్శనమన్నారు కేటీఆర్.
2014 తర్వాత తెలంగాణ వైద్యరంగంలో వచ్చిన మార్పులను లెక్కలతో సహా వివరించారు కేటీఆర్. 2014లో వైద్యరంగంలో తలసరి హెల్త్ బడ్జెట్ రూ.925గా ఉంటే.. 2023 నాటికి అది 3,532 రూపాయలకు పెరిగిందన్నారు. హాస్పిటల్ బెడ్స్ 2014లో 17 వేలు ఉంటే.. 2023 నాటికి ఆ సంఖ్య 34 వేలకు పెరిగిందని చెప్పారు. ఇక ఆక్సిజన్ బెడ్స్ 2014లో కేవలం 14 వందలు మాత్రమే ఉంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని బెడ్స్‌కు ఆక్సిజన్ సదుపాయం కల్పించామన్నారు. ఇక 2014కు తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే.. 2023 నాటికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు పెంచామన్నారు. మరో 8 మెడికల్ కాలేజీలకు అనుమతిచ్చామని చెప్పారు.
2014కు ముందు తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు 2,850 ఉంటే ఇవాళ ఆ సంఖ్య 8,515కు పెంచామన్నారు. ఇక పీజీ సీట్లు 1,183 నుంచి 2,890కి పెరిగాయన్నారు. సూపర్ స్పెషాలిటీ సీట్లు 79 నుంచి 206కు పెరిగాయన్నారు. ఇక డయాలసిస్ సెంటర్లు 3 నుంచి 82కు చేరుకున్నాయన్నారు. 2014కు ముందు ఐసీయూలు 5 ఉంటే ఇవాళ ఆ సంఖ్య 80కి చేరుకుందన్నారు. 2014కు ముందు 108 అంబులెన్సుల సంఖ్య 316గా ఉంటే ఇవాళ 455 ఉన్నాయన్నారు. 2014 తర్వాత 300 అమ్మ ఒడి వాహనాలు తీసుకువచ్చామన్నారు.
కేసీఆర్ కిట్ లాంటి అద్భుతమైన పథకాలతో ప్రభుత్వ హాస్పిటల్స్‌పై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు కేటీఆర్. 2014కు ముందు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో డెలివరీలు 30 శాతం ఉంటే.. ఇప్పుడు 70 శాతానికి పెరిగాయన్నారు. వాక్సినేషన్ రేటు వంద శాతానికి చేరుకుందన్నారు. ప్రసూతి మరణాల రేటు 92 శాతం నుంచి 43కి పడిపోయిందన్నారు. నవజాత శిశువుల మరణాల రేటు 39 నుంచి 21కి తగ్గిందన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ కిట్స్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్, కంటివెలుగు, బస్తీ దవాఖానాలు, డయాగ్నోస్టిక్ హబ్స్, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి లాంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్‌లో నాలుగు టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్‌లో రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్స్‌లో 2 వేల బెడ్స్‌తో దశాబ్ధి బ్లాక్, ప్రతి నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్, ప్రతి మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.