మోదీ అవసరం లేదు.. మనమే సాధించుకుందాం
తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు హరీష్ రావు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నామని, దేశంలో ఇంకెక్కడా ఇలాంటి పథకం అమలులో లేదని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ వర్గాన్ని ప్రధాని మోదీ మోసం చేశారంటూ మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎస్సీ వర్గీకరణ కోసం రెండు సార్లు కేంద్రానికి తీర్మానం చేసి పంపించామని, కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదని చెప్పారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లుగా ఎస్సీ వర్గీకరణపై తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న మోదీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై సమాధానం చెప్పిన తర్వాతే ఆయన తెలంగాణకు రావాలన్నారు. మాదిగలపై మోదీకి చిత్తశుద్ది లేదని విమర్శించారు హరీష్ రావు. ఎమ్మార్పీఎస్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎస్సీ వర్గీకరణ గురించి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా మోదీ పట్టించుకోలేదన్నారు హరీష్ రావు. వర్గీకరణ కోసం చేసిన తీర్మానాన్ని రాజయ్య, కడియం శ్రీహరితో మోదీకి చేర్చామని గుర్తు చేశారు. కానీ కేంద్రం ఆ తీర్మానాన్ని పట్టించుకోలేదని మూలనపడేసిందని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీతో మనకు పనిలేదని.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని.. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని స్పష్టం చేశారు హరీష్ రావు.
దళితులకు న్యాయం చేసింది కేసీఆరే..
తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు హరీష్ రావు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నామని, దేశంలో ఇంకెక్కడా ఇలాంటి పథకం అమలులో లేదని అన్నారు. దళితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎస్సీ వర్గీకరణ విషయంలో సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.