బంగారం పెట్టలేదని అలిగి విద్యుత్ స్తంభమెక్కిన అల్లుడు
పెళ్లయిన నాటినుంచి ఇప్పటివరకు తనకు అత్త బంగారం పెట్టలేదని మనస్తాపానికి గురైన అల్లుడు.. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ విద్యుత్ స్తంభం ఎక్కేశాడు.
అల్లుడొచ్చాడంటే అత్తవారిళ్లలో సందడి వాతావరణం నెలకొంటుంది. అల్లుడికి సకల మర్యాదలూ చేసి గౌరవంగా చూసి పంపించాలని ఆశ పడుతుంటారు. తమ శక్తికొద్దీ.. అన్నింటినీ సమకూర్చడానికి ప్రయత్నిస్తారు. ఎన్ని చేసినా ఏదో ఒక విషయంలో అలకలు చూపుతుంటారు పలువురు అల్లుళ్లు. వారిని ఇబ్బంది పెడుతున్నామని, తామంటే భయంతో తమ కంట్రోల్‌లో ఉంటారని అనుకుంటారు గానీ.. జీవితకాలం తమ పట్ల అత్తవారింట విముఖత ఏర్పాటు చేసుకుంటున్నామనే విషయం గుర్తించరు. కూతురు కోసం తప్పనిసరై మర్యాదలు చేసి పంపినా.. వాటిలో ప్రేమ, ఆప్యాయతల కంటే.. ఆందోళన, ఇబ్బందే ఉండటం ఆరోగ్యకర పరిణామం కాదనే విషయాన్ని అర్థం చేసుకోరు.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. అత్తింటివారిపై అలిగిన ఓ అల్లుడు ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కడం. స్థానికంగా సంచలనం సృష్టించి, అధికారుల్లో కలకలం రేపిన ఈ ఘటన మెదక్‌లో జరిగింది. స్థానిక పురపాలక సంఘం పరిధిలోని 18వ వార్డు గాంధీనగర్‌కు చెందిన శేఖర్.. 12 సంవత్సరాల కిందట ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
పెళ్లయిన నాటినుంచి ఇప్పటివరకు తనకు అత్త బంగారం పెట్టలేదని మనస్తాపానికి గురైన అల్లుడు.. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ విద్యుత్ స్తంభం ఎక్కేశాడు. ఆకస్మిక పరిణామంతో స్థానికులు, అత్తింటివారు విస్తుపోయారు. వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారమివ్వడంతో వారు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అతన్ని ఎంత బతిమాలినా కిందకు దిగి రాకపోవడంతో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు భట్టి జగపతి, డీఎస్పీ సైదులు అక్కడికి చేరుకుని అతనికి నచ్చజెప్పి కిందికి దించారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. విద్యుత్ స్తంభమెక్కిన ఆ అల్లుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండటం గమనార్హం.