పెళ్ళైనా ప్రేమను కొనసాగించిన ఫలితం.. యువకుడి దారుణ హత్య

యువతి కుటుంబ సభ్యులు తీరు మార్చుకోవాలని వంశీని పలుమార్లు హెచ్చరించారు. తమ కుమార్తెకు వివాహం అయ్యిందని.. ఆమెకు దూరంగా ఉండాలని సూచించారు. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Update:2023-06-26 12:05 IST

ఆ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. యువతిని మరో అబ్బాయికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. అయినా ఆ ప్రేమ జంట తమ బంధాన్ని కొనసాగించారు. ఇది అత్తింటివారికి తెలియడంతో యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

బీర్‌పూర్‌కు చెందిన వంశీ(23) తుంగూర్‌లోని డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నాడు. అతడు ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని గతంలో ప్రేమించాడు. వీరి ప్రేమ గురించి పెద్దలకు తెలిసి అడ్డు చెప్పారు. యువతి తల్లిదండ్రులు రెండేళ్ల కిందటే ఆమెను మరో అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహం జరిగిన తర్వాత కూడా వంశీ, ఆ యువతి తమ ప్రేమను కొనసాగించారు. నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో అత్తింటివారికి కూడా అనుమానం వచ్చింది. గతంలో ప్రేమించిన అబ్బాయిని ఇంకా మర్చిపోలేదని, మళ్లీ కలుసుకుంటున్నారని అత్తింటివారు అనుమానించారు. ఈ విషయాన్ని వారు యువతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు.

దీంతో యువతి కుటుంబ సభ్యులు తీరు మార్చుకోవాలని వంశీని పలుమార్లు హెచ్చరించారు. తమ కుమార్తెకు వివాహం అయ్యిందని.. ఆమెకు దూరంగా ఉండాలని సూచించారు. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.

ఆదివారం వంశీ తుంగూర్ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించి గొడ్డలితో తలపై నరికారు. దీంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వంశీ బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. హత్యకు పాల్పడిన వారిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

డీఎస్పీ ప్రకాష్ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. యువతి తండ్రి రమేష్, అతడి సోదరుడు విష్ణు త‌న‌ కుమారుడిని హత్య చేశారని వంశీ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags:    
Advertisement

Similar News