లీకుల రాజకీయం... బక్రాలయ్యేదెవరు ?

మంత్రి మల్లా రెడ్డి, అతని కుటుంబ సభ్యుల ఇళ్ళపై జరుగుతున్న ఐటీ రైడ్ లలో ఒక్కొక్కరి ఇంట్లో 2 కోట్ల రూపాయల నగదు దొరికిందని, అది మొత్తం 8 కోట్లుందని అన్ని తెలుగు వార్తా ఛానళ్ళు ప్రకటించాయి. ఈ విషయంపై అధికారికంగా ఐటీ అధికారులెవ్వరూ నోరు తెరవలేదు.

Advertisement
Update:2022-11-24 13:32 IST

రాజకీయ నాయకులు తాము ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆపని పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు లీక్ అనే ఆయుధాన్ని వాడుకుంటారు. వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా వాళ్ళ మనుషులతో ఆ వార్తను మీడియాలోని పలువురు జర్నలిస్టులకు లీక్ చేస్తారు. ఇక ఆ జర్నలిస్టులు ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియని ఓ రహస్య విషయం మాకే ముందుగా తెలిసిందని ఉబ్బితబ్బిబ్బయిపోయి ఆ వార్తను ప్రసారం, ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ఆ విషయంపై ప్రజల స్పందనను బట్టి ఆ పని చేయాలో వద్దో రాజకీయనాయకులు నిర్ణయించుకుంటారు.

ఇక రెండో రకం లీకులుంటాయి. అవి కొందరి మీద బురదజల్లడానికి, అసత్యాలు ప్రచారం చేయడానికి ఉపయోగించే లీకాస్త్రం అది. ఫలానా రాజకీయ నాయకుడికి లేక నాయకురాలికి సీబీఐ నోటీసులిచ్చిందని, లేదా ఈడీ నోటీసులు ఇచ్చిందని, త్వరలోనే వారిపై కేసు నమోదు కాబోతుందని ప్రచారం జరుగుతుంది. వార్తలు ప్రచారం అవుతాయి కానీ ఎప్పటికీ ఆనాయకులకు నోటీసులు రావు, కేసులు కూడా నమోదు కావు. కానీ ఈ లోపు వారు కావల్సినంత బద్నామ్ మాత్రం అవుతారు.

ఇక మరో రకం ఎవరి మీదనైనా ఈడీ , ఐటీ తదితర సంస్థలు దాడులు చేసినప్పుడు వచ్చే లీకులు మరో రకం... ఒకవైపు అధికారులు సోదాలు నిర్వహిస్తూనే ఉంటారు. వాళ్ళింట్లో కేజీలకొద్ది బంగారం దొరికిందని, కోట్లాది రూపాయల నగదు దొరికిందని వాటిని లెక్కబెట్టడానికి అధికారులు మనీ కౌంటింగ్ మిషన్లను తెప్పించారని, వాళ్ళింట్లో డిజిటల్ లాకర్లున్నాయి. అవి తెరవడానికి సదరు వ్యక్తి సహకరించడం లేదని, ఆయనకు అనేక బ్యాంకుల్లో పదుల సంఖ్యలో లాకర్లున్నాయని అందులో కీలక పత్రాలు, బంగారం, కోట్ల రూపాయల నగదు దొరికిందని ప్రచారం జరుగుతుంది. టీవీల్లో స్క్రోలింగులు..... స్పెషల్ బులెటిన్లతో యాంకర్లు అదరగొడుతూ ఉంటారు. ఇవేమీ అధికారిక వార్తలు కాదు. 'సమాచారం తెలిసింది..', 'అలా జరిగినట్టు అనుకుంటున్నారు.', 'మాకు తెలిసిన‌ సోర్స్ ప్రకారం', 'అధికారులు అనుకుంటున్నట్టు తెలిసింది'. ఇలా ఉంటాయి మీడియా వార్తలు. ఈ వార్తలన్నీ మీడియా ప్రతినిధులేమీ ఊహించుకోని రాయరు. ఇలా వార్తలు రావడం వల్ల ఎవరికైతే ఉపయోగమో ఆ వర్గాలు మీడియాకు రహస్య సమాచారమంటూ గుసగుసగా ఈ లీకులిస్తారు.

ఇప్పుడు మల్లా రెడ్డి, అతని కుటుంబ సభ్యుల ఇళ్ళపై జరుగుతున్న ఐటీ రైడ్ ల విషయంలో కూడా వస్తున్న లీకులు నిజమయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటి కైతే ఎవరికీ తెలియదు. ఒక్కొక్కరి ఇంట్లో 2 కోట్ల రూపాయల నగదు దొరికిందని, అది మొత్తం 8 కోట్లుందని అన్ని తెలుగు వార్తా ఛానళ్ళు ప్రకటించాయి. అది కూడా వాళ్ళ సోర్స్ ఆధారంగానే... ఈ విషయంపై అధికారికంగా ఐటీ అధికారులెవ్వరూ నోరు తెరవలేదు. మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రెండు డిజిటల్ లాకర్లను అధికారులు గుర్తించినట్టు మరో లీక్. అది పచ్చి అబద్దమని స్వయంగా రాజశేఖర్ రెడ్డే ప్రకటించారు. ఈ విషయంలో కూడా అధికారులు ఇప్పటి వరకు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడుతారో లేదో తెలియదు.

కానీ ఈ లీకులు ఎవరి కోసం, ఎవరి చేత, ఎవరు ఇస్తున్నారన్నది మీడియా అర్దం చేసుకొని ప్రవర్తించనంత కాలం బక్రాలయ్యేది మీడియా, వారి మాటలు నమ్మే జనం మాత్రమే.

Tags:    
Advertisement

Similar News