ఎల్బీనగర్ చౌరస్తా ఇకపై శ్రీకాంతాచారి చౌరస్తా : మంత్రి కేటీఆర్
మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరును ఈ చౌరస్తాకు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ చౌరస్తాను ఇకపై శ్రీకాంతాచారి చౌరస్తాగా మారుస్తున్నట్లు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎల్బీనగర్‌లో కొత్తగా నిర్మించిన ఫ్లైవోవర్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరును ఈ చౌరస్తాకు పెడుతున్నట్లు చెప్పారు. అంతే కాకుండా కొత్తగా ప్రారంభించిన ఫ్లైవోవర్‌కు మాల్ మైసమ్మ అని నామకరణం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పేర్లకు సంబంధించిన జీవోలు రెండు, మూడు రోజుల్లోనే జారీ చేయనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎల్బీనగర్ చౌరస్తాను సిగ్నల్ ఫ్రీ చేసేందుకు ఎస్ఆర్డీపీ కింద ఫ్లై వోవర్లు నిర్మించామని చెప్పారు. ఇకపై విజయవాడ నుంచి వచ్చే వాహనాలు ఎలాంటి సిగ్నల్ కోసం వెయిట్ చేయకుండా ఈ ఫ్లైవోవర్లు ఉపయోగపడతాయని మంత్రి చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం 12 పనులను ఎస్ఆర్డీపీ కింద చేపట్టామని.. వీటి మొత్తం వ్యయం రూ.650 కోట్లని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 9 ప్రాజెక్టులు పూర్తయ్యాయని.. మరో మూడు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బైరామల్‌గూడలో సెకెండ్ లెవెల్ ఫ్లైవోవర్, రెండు లూప్‌లు సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని.. అవి పూర్తైన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని కేటీఆర్ చెప్పారు.
ఇక ఎంతో కాలంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను విస్తరించాలని వినతులు వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఒకప్పుడు ఎల్బీనగర్ చౌరస్తా దాటాలంటే 20 నిమిషాల సమయం పట్టేది.. కానీ ఇప్పుడు ఫ్లైవోవర్లు, అండర్ పాస్‌లు రావడంతో ట్రాఫిక్ వేగంగా ముందుకు కదులుతోందని అన్నారు. ప్రజా రవాణాను మరింత మెరుగుపరచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను తప్పకుండా తీసుకొని వస్తామని, తర్వాత వచ్చేది కూడా మా ప్రభుత్వమే కాబట్టి.. ఈ డిమాండ్ తప్పకుండా నెరవేరుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు కూడా మెట్రోను విస్తరించే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. అవసరం అయితే ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కేటీఆర్ చెప్పారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారం పాత ఫ్రూట్ మార్కెట్ ప్లేస్‌లో టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మరో ఏడాదిన్నరలోనే అక్కడ వెయ్యి పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇక నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న జీవో 118 సమస్యను పరిష్కరించామని.. ఈ నెలాఖరు లోగా పట్టాలు అందిస్తామని అన్నారు.