గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేస్తరా?
ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
జైలులో గుండెపోటు వచ్చిన రైతు హీర్యానాయక్ కు గుండెపోటు వస్తే బేడీలతో ఆస్పత్రికి తరలిస్తారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేయడం అమానవీయమని.. రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శమని అన్నారు. హీర్యానాయక్ కు సకాలంలో వైద్యం చేయించడంలో ప్రభుత్వం అలసత్వం చూపించిందన్నారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. హీర్యానాయక్‌కు బుధవారమే గుండెలో నొప్పి వచ్చినా ప్రభుత్వం చికిత్స చేయించకపోవడంతో ఈరోజు ఉదయం మళ్లీ గుండెపోటు వచ్చిందని, అప్పుడు సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారని తెలిపారు. బీఆర్‌ఎస్ ఒత్తిడి చేయడంతో ఆయనను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్తున్నారని మండిపడ్డారు. జైలులో ఉన్న రాఘవేంద్ర, బసప్పకు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయని, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి అనేక ఆరోగ్య సమస్యలున్నాయని తెలిపారు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాల్సి ఉండగా, బేడీలు వేసి తీసుకెళ్లారని చెప్పారు. ఇలా అమానవీయంగా ప్రవర్తించడం క్షమార్హం కాదన్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గవర్నర్ ఈ అంశంపై విచారణకు ఆదేశించాలని కోరారు. ముఖ్యమంత్రి జైపూర్లో విందులు వినోదాలలో జల్సాలు చేసుకుంటూ చిందులు వేస్తున్నారని, గిరిజన రైతులు ఇక్కడ జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి నిజంగానే హృదయం ఉంటే, గిరిజనులపై ప్రేమ ఉంటే గిరిజన రైతులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని ఆదేశించారు. తాము చెప్పిందే నడవాలన్న అహంకారంతో రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు గిరిజన రైతుల ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. రేవంత్ ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తనపై గిరిజన రైతులు దాడి చేయలేదని కలెక్టర్ చెప్పినా రేవంత్ కేసులు పెట్టించారని, అహంకారంతో 17 మంది రైతులను అరెస్ట్ చేయించారని అన్నారు. అదుపులోకి తీసుకున్న రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఆ విషయం బయటికి చెప్తే వాళ్ల కుటుంబ సభ్యులను కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారని తెలిపారు. అదానీ కోసం, అల్లుడి కోసం భూములు గుంజుకోవాలని చూస్తే ఇవ్వకపోవడమే ఆ పేద రైతులు చేసిన తప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నామని మండిపడ్డారు. ఎకరానికి రూ.70 లక్షలు విలువ చేసే భూమిని రూ.10 లక్షలకే ఇవ్వాలంటే ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. భూదాహంతోనే రేవంత్ రెడ్డి రైతులను జైల్లో పెట్టారని, సీఎం ఆదేశాలతోనే వారిపై పెట్టిన కేసులకు సంబంధించిన పేపర్లు కూడా ఇవ్వకుండా పోలీసులు 20 రోజుల పాటు తిప్పారని చెప్పారు.